బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 25 నవంబరు 2021 (11:49 IST)

హ‌మ్మయ్య ... రాయ‌ల చెరువు క‌ట్ట ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లే!

రాయల చెరువుకు అడ్డుకట్టకు యుద్ద ప్రాతపదికన లీకేజీ పనులు చేస్తున్నారు. దీనితో రాయల చెరువు కట్ట ప్రమాద పరిస్థితులను అధిగమించినట్లేనని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితోపాటు, స్థానికులు, జిల్లా యంత్రాంగం కృషి చేసింది. చెరువుకు గండిపడిన స‌మ‌యంలో, మరో వైపు చెరువులో వరద నీటి ఒత్తిడిని తగ్గించేందుకు మొరవ పనులు వేగవంతం చేశారు. నీటి లీకేజీని అరికట్టేందుకు చేపట్టిన పనులు యుద్ద ప్రాతపదికన సాగుతున్నాయి. 
 
 
ఈ పనులను స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరంతరంగా పర్యవేక్షిస్తూ, అధికారులు, సిబ్బందిని సమన్వయం చేస్తున్నారు. పనుల పనితీరును పరిశీలిస్తూ, ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నుంచి భారీ యంత్రాలు తెప్పించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి రాయల చెరువు కట్ట బలోపేతం పనులతో పాటు మొరవ పనులను శరవేగంగా చేయిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనుల క్రమంలో వరద ముంపు ప్రమాదం నుంచి బయట పడినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి గత నాలుగు రోజులుగా రాయల చెరువు కట్టపైనే ఉంటూ, ప్రజల్లో మనోధైర్యాన్ని నింపారు. మూడో రోజు కూడా వరద బాధిత ప్రాంత గ్రామాలకు నిత్యావసర సరుకులను అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. నేవీ హెలీకాఫ్టర్ ద్వారా బాధితుల‌కు స‌హాయం అందిస్తూ, తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. 
 
 
భారీ క్రేన్లు, ఇటాచీ, టిపర్లు, ట్రాక్టర్లతో ఇసుక బస్తాలను రాయల చెరువుకు గండి పడిన ప్రదేశానికి చేర్చడంలో తిరుపతి రూరల్ ఎంపీపీ మోహిత్ రెడ్డి చర్యలు చేపట్టారు. గండిపడిన ప్రదేశంలో అడుగు నుంచి పైకి ఇసుక మూటలను పేర్చారు. కట్ట మట్టి జారకుండా ఉండేందుకు లీకేజీ అవుతున్న నీటిని పైపుల ద్వారా బయటకు పంపించే ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సుమారు 20 వేల ఇసుక బ్యాగులు అమర్చారు. దీని పటిష్టత కోసం రాళ్లతో కూడిన మట్టిని కూడా నింపారు.


రాయల చెరువు మొరవ పనులు నేపథ్యంలో చెరువు నుంచి 3,800 క్యూసెక్కుల నీరు బయటకు తరలించారు. దీంతో చెరువులో 2 అడుగుల వరకు నీరు తగ్గింది. ఎమ్మెల్యే తనయుడు, తిరుపతి రూర్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గండి బలోపేతానికి చేపడుతున్న పనులలో ఇసుక మూటలు మోసి కార్మికుల్లో ఉత్తేజాన్ని నింపారు. తండ్రికి తగ్గ తనయుడిగా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.