కారు పార్టీలో చేరినా సైకిల్ గుర్తుకే ఓటేయమన్న ‘నామా’..?
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలలో జంపింగ్‌లు సహజం. అలా మారిన వారు పార్టీ గుర్తులు కూడా మారతాయనే విషయాన్ని మరచిపోయి గత పార్టీ తాలూకు గుర్తులను ప్రచారం చేస్తూ ప్రజలకు అడ్డంగా దొరికిపోతుంటారు. ఇలాంటిదే ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
టీడీపీతో పదిహేనేళ్ల అనుబంధాన్ని అంత తేలిగ్గా వదులుకోలేని నామా నాగేశ్వరరావు సైకిల్ గుర్తుకే ఓటు వేయండంటూ ఎన్నికల ప‍్రచారంలో అడ్డంగా బుక్కయ్యారు. మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరడం, అలాగే ఆ పార్టీ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగటం చకచకా జరిగిపోయాయి. అంతవరకూ బాగానే ఉంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నామా నాగేశ్వరరావు... కారు గుర్తుకే ఓటేయాలని కోరడానికి బదులు.. సైకిల్ గుర్తుకే.. సైకిల్ గుర్తుకే.. సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ ఒకసారి కాదు ఏకంగా మూడుసార్లు నినాదాలు చేశారు. దీంతో ప్రచారంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే తేరుకున్న పార్టీ నేతలు.... మీరు ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉన్నారు.
టీడీపీలో కాదంటూ నామా నాగేశ్వరరావును అప్రమత్తం చేసారు. దీంతో నాలిక కరుచుకున్న నామా తన తప్పును సరిదిద్దుకునేందుకు కవరింగ్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి నామా నాగేశ్వరరావు పరాజయం పొందారు.
అయితే తెలంగాణ టీడీపీలో ఉంటే తన మనుగడ కష్టమని గ్రహించిన ఆయన ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా చౌదరి బరిలో ఉన్నారు. నామా నాగేశ్వరరావు 2009 ఎన్నికల్లో రేణుకా చౌదరిపై టీడీపీ తరఫున ఎంపీగా గెలిచారు.