మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (16:30 IST)

ఆన్‌లైన్ ఆనందయ్య కరోనా మందు పంపిణీ.. కలెక్టరుతో భేటీ!

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్య నిపుణుడు ఆనందయ్య కరోనా బాధితులకు స్వస్థత చేకూర్చే నిమిత్తం ఇస్తున్న మందును ఇకపై ఆన్‌లైన్‌లో పంపిణీ చేయనున్నారు. ఇదే అంశంపై ఆయన జిల్లా కలెక్టరుతో సంప్రదింపులు జరుపుతున్నారు. 
 
ఆనంద‌య్య క‌రోనా మందుకు ఏపీ హైకోర్టు పచ్చజెండా ఊపింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ క‌మిటీ ఇచ్చిన‌ నివేదిక ప్ర‌కారం హైకోర్టుతో పాటు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే, కంట్లో వేస పసరు మందుకు మాత్రం తాత్కాలిక అనుమతి నిలిపివేశారు. మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వ‌డంతో ఆ మందు కోసం జ‌నాలు ఎదురుచూస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో మందు పంపిణీపై క‌లెక్ట‌ర్ చ‌క్ర‌ధ‌ర్‌బాబుతో ఆనంద‌య్య మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆనంద‌య్య‌ను ముందు నుంచి ప్రోత్సహిస్తోన్న ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఈ స‌మావేశానికి హాజరయ్యారు. 
 
కలెక్టర్‌తో సమావేశం తర్వాత నాలుగైదు రోజుల్లో మందు పంపిణీ ప్ర‌క్రియను ప్రారంభించాల‌ని ఆనంద‌య్య, కాకాని నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనా నిబంధ‌న‌ల ప్ర‌కారం మందును పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు. 
 
ముఖ్యంగా, ఔష‌ధం పంపిణీకి తీసుకోవాల్సిన ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. వికేంద్రీక‌ర‌ణ ప‌ద్ధ‌తి, ఆన్‌లైన్ ద్వారా మందుల పంపిణీకి నిర్ణ‌యం తీసుకున్నారు. అదేసమయంలో ప్రభుత్వం కూడా మందు పంపిణీపై కొన్ని ఆంక్షలు కూడా విధించింది. కరోనా రోగులెవ్వరూ రావొద్దని, వారి కుటుంబ సభ్యులు మాత్రమే వచ్చి మందు తీసుకెళ్లాలని కోరింది.