పేదరికాన్ని అంతమొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల సదుపాయాన్ని కల్పిస్తోంది. సమాజంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు, చేనేత కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల నుంచి పది హేను వందల వరకు పింఛన్లను అందిస్తోంది. సమాజంలోని అట్టడుగు ప్రజలు జీవన పోరాటంలో విజయం సాధించాలన్న లక్ష్యంతో అప్పటి వరకు నెలకు రూ. 200 మాత్రమే అందించే పింఛన్ ను రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి రూపాయలకు పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కరువు, దిర్భిక్షం, వరదల సమయంలో జీవనోపాధి కోల్పోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారందరికీ జీవన భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను అందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 42 లక్షల 68 వేల 811 మందికి గాను, నెల నెల రూ. 456 కోట్ల 69 లక్షల 26 వేల రూపాయలను పింఛన్ల రూపంలో ప్రభుత్వం అందిస్తోంది.
కొత్తగా మూడున్నర లక్షల మందికి పింఛన్లు
రాష్ట్రంలో ఇప్పటికే 42 లక్షల 68 వేల 811 మందికి పింఛన్లు మంజూరు చేస్తుండగా... మరో మరో 3.5లక్షల మందికి అదనంగా కొత్త పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దరఖాస్తు చేసుకున్న అర్హుల పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాత... గ్రామసభల్లో ఆయా వర్గాల ప్రజలకు కొత్త పింఛన్లను పంపిణీ చేస్తారు. ఎన్నాళ్ల నుంచో దరఖాస్తు చేసుకున్నవారు, నిజమైన అర్హులందరికీ పింఛన్లను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
జన్మభూమితో బాధ్యత
లబ్ధిదారులకు ప్రభుత్వసాయం అందించడం, ప్రజలకు లబ్ధి చేకూర్చడం, ఫిర్యాదులు స్వీకరించడం, జవాబుదారీతనం పెంచడం, ప్రజల వద్దకు ప్రభుత్వ పాలనే జన్మభూమి కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పింఛన్లు అందుకుంటున్నవారికి ఎదురవుతున్న సమస్యలను జన్మభూమి వేదికగా పరిష్కారిస్తారు. ఇటీవల నోట్ల రద్దు తర్వాత పింఛన్ల మంజూరు విషయంలో తలెత్తిన సమస్యలను అధగమించేందుకు చర్యలు చేపడతారు. గత నెలతో పోల్చితే ఈ నెల పింఛన్లను నిర్ణీత సమయంలో అందించడానికి ముఖ్యమంత్రి అధికారులను ఇప్పటికే ఆదేశించారు. పింఛన్ల మొత్తం చెల్లించడానికి కావాల్సిన నగదును సైతం అందుబాటులో ఉంచినట్టు బ్యాంకర్లు వెల్లడించారు.
పింఛన్ల మంజూరు, పంపిణీలో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు:
ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పింఛన్ల విషయంలో ఫిర్యాదులను సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పింఛన్ల మంజూరు, పంపిణీ పారదర్శకంగా జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తన, మన అని లేకుండా అర్హులు అందరికీ ఇవ్వాలని, అందరినీ కలుపుకు వెళ్లాలని, ఎటువంటి అక్రమాలకు, విమర్శలకు తావివ్వరాదని సూచించారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరులో, పంపిణీలో వసూళ్లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంగా పనిచేయాలని సీఎం పేర్కొన్నారు.
పది వేల కోట్ల రూపాయల పింఛన్ల పంపిణీ
రాష్ట్రంలోని నిరుపేదలకు అందిస్తున్న పింఛన్ల కార్యక్రమానికి గడిచిన రెండున్నరేళ్లలో పది వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. 2014 అక్టోబర్ 2న ప్రారంభించిన ఈ పథకం పేదలకు ఊపిరినిస్తోంది. అప్పటి వరకు పింఛన్లకు ఖర్చు చేసే మొత్తానికి ఐదు రెట్లు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తోంది.
సామాజిక భద్రత
సమాజంలోని అట్టడుగు ప్రజలకు చేయూతను అందించేందుకు చేయాల్సిన అన్ని రకాల కార్యక్రమాలను చేయాలని... వారికి సామాజిక భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రస్తుతం రాష్ట్రంలోని 42 లక్షల 68 వేల 811 మంది నిరుపేదలకు నెలకు వెయ్యి, పది హేను వందల రూపాయల చొప్పున పింఛన్లను అందిస్తోంది. 48.4 % వృద్ధులు, 36.1 % వితంతువులకు, 12.6 % మేర వికలాంగులకు పింఛన్లను అందిస్తున్నారు. మిగతా 2.9 శాతం పింఛన్లను చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, కళాకారులు, ఎయిడ్స్ బాధితులకు ఇస్తున్నారు. వీరందరికీ నెలకు వెయ్యి రూపాయల చొప్పున నెల నెలా పింఛన్ అందిస్తున్నారు. ఇక దివ్యాంగులకు నెలకు 1500 రూపాయల మేర పింఛన్ అందిస్తున్నారు. ఇలా పింఛన్లు చేయడం వల్ల ఆయా వర్గాల ప్రజల జీవితాలకు ప్రభుత్వం భరోసా ఇచ్చినట్టవుతోంది. తాజా పింఛన్ల సంఖ్య 46 లక్షల 18 వేల 811కు చేరనుంది.
విజన్ 2029 లక్ష్యంతో ముందడుగు
ప్రజలకు దీమా కలిగించడం... సమాజంలోని నిరుపేదల ఉనికిని నిలబెట్టేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. విజన్ 2029 లక్ష్యంతో ముందడుగేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిస్సహాయులకు, నిరుపేదలకు వారి కాళ్లపై వారు నిలబడేలా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. వాటిలో భాగంగానే రాష్ట్రంలోని పలు సెక్షన్ల ప్రజలకు పింఛన్లతో భరోసా కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అందుకు అనుసరించాల్సిన పంథాకు తగిన విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ 2029 లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాల్లో సామాన్యుడికి అత్యావశ్యకమైన అంశాల్లో సామాజిక భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. సామాన్యుడి ఆదాయం పెంచడమే లక్ష్యమని... సామాన్యుడిని తన కాళ్లపై నిలబడేలా చేయాలన్న సత్సంకల్పంతో ప్రభుత్వం ముందడుగేస్తోంది. అందులో భాగంగానే 46 లక్షల మందికిపైగా అర్హులకు పింఛన్లను అందిస్తోంది.