ప్రభుత్వ మద్యం దుకాణాలకు జగనన్న పేరు పెట్టాలి
ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు జగనన్న పేరు పెట్టాలని, జగనన్న ఫోటో మద్యం బాటిల్స్ పై వెయ్యాలని సాలూరు జనసేన పార్టీ డిమాండ్ చేసింది. వైసీపీ ప్రభుత్వం విడతల వారిగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి, నేడు ప్రజల్లో మద్యం మాన్పించే చర్యలు చెయ్యకుండా, అధిక ధరలకు కొత్త కొత్త బ్రాండుల మద్యం అమ్ముతూ, పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలతో అడుకుంటోందని ఆరోపించారు. కొన్ని దశాబ్దాలుగా తగ్గిన నాటుసారా వినియోగం, నేడు ప్రభుత్వ నిర్ణయం వల్ల కుప్పలు తెప్పలుగా పెరిగిందని, ఎందరో అమాయకులు ఆరోగ్యాలు పాడు చేసుకొని ప్రాణాలు కోల్పోతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కళ్ళు తెరచి ప్రభుత్వం, సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలని, లేదా పాత ధరలకే పాత బ్రాండుల మద్యం అమ్ముతూ, నాటు సారాను నిర్ములించే చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ సాలూరు నాయకులు డిమాండు చేశారు.
ఇక ప్రతి ప్రభుత్వ పథకాలకు జగనన్న తోడు, జగనన్న చేదోడు, జగనన్న అమ్మవడి, జగనన్న వసతి దీవెన, జగనన్న జీవ క్రాంతి, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న పచ్చ తోరణం...ఇలా చాలా పథకాలకు జగనన్న పేరు పెట్టి, మద్యం షాపులకు మాత్రం జగనన్న పేరు పెట్టకపోవడం బాధాకరం అన్నారు. తక్షణమే జగనన్న మద్యం దుకాణంగా పేరు మార్చాలని డిమాండు చేశారు.
అదే విధంగా మద్యం తాగేవారు ధరలు పెంచితే, మద్యం ఆపేస్తారు అని చెప్పి, నచ్చిన బ్రాండులు సైతం భారీ ధరలకు అమ్ముతున్నారని చెప్పారు. ధరలు పెంచితే మద్యం మానేస్తారు అన్నట్లే, జగన్ ఫోటో మద్యం సీసాలపై వేస్తే, ఆ ఫోటో చూసి కొందరు జగన్ అభిమానులు మద్యం మానేసే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. జగన్ ఫోటో మద్యం సీసాలపై వేసి. తద్వారా మద్యం మాన్పించి యువతకు ఆదర్శంగా నిలవాలి అని తెలియచేశారు.