ఆదివారం, 16 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 మార్చి 2025 (17:07 IST)

జనం కోసం పుట్టిన పార్టీ ఇపుడు ఆంధ్ర మత సేనగా మారిపోయింది : షర్మిల

ys sharmila
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. జనసేన.. జనం కోసం పుట్టిన పార్టీ. ఇపుడు ఆంధ్ర మత పార్టీగా మార్చారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పిఠాపురం వేదికగా జరిగిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంపై షర్మిల స్పందించారు. 
 
పవన్ కళ్యాణ్.. చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్లొదిలేశారని, ఇపుడు ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల జపం చేస్తూ వారి సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని విమర్శించారు. పవన్ మాటలు చూస్తుంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నట్టు కనిపిస్తుందన్నారు. జనసేన పార్టీని ఆంధ్ర మత సేన పార్టీగా మార్చారంటూ ఎద్దేవా చేశారు. 
 
జనసేన.. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణమన్నారు. సర్వమత సమ్మేళంగా విరాజిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్టుగా పవన్ వైఖరి ఉండటం విచారకరమన్నారు. పార్టీ పెట్టి 11 యేళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్టుగా ఆయన మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నట్టు తెలిపారు.