శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 ఆగస్టు 2022 (09:03 IST)

తితిదే ఆరుగురు అక్రమ దళారుల అరెస్టు

arrest
తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ రకాలైన అక్రమాలకు పాల్పడుతున్న ఆరుగురు దళారులను తితిదే విజెల్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ అక్రమార్కుల్లో సూపరింటెంటెండ్ స్థాయి అధికారి ఒకరు ఉండటం గమనార్హం. వీరిపై తితిదే విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
 
ఎంపీ, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో దర్శన టికెట్లు ఇప్పించడంలో అక్రమాలు గుర్తించిన తితిదే విజిలెన్స్ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీవారి దర్శన టికెట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు రావడంతో విశాఖలోని తితిదే హెచ్‌డీపీపీ విభాగంలో పనిచేస్తున్న మల్లికార్జునను పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఆయనతో పాటు దళారులు వెంకట మురళీకృష్ణ, వంశీకృష్ణ, గణేశ్ వెంకట సుబ్బారావుతో పాటు కంఠసాని విజయకుమారి, కంఠసాని నవ్యశ్రీని అదుపులోకి తీసుకున్నారు. తితిదేలో పని చేస్తున్న మల్లికార్జున సిఫారసు లేఖలతో 6 నెలల్లో 700మందికి దర్శనాలు చేయించారని విచారణలో వెల్లడైంది. 
 
350 మందికి బ్రేక్‌ దర్శనాలు, 350 మందికి 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు, 12 కల్యాణోత్సవ టికెట్లు ఇప్పించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.