శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 5 మార్చి 2017 (03:13 IST)

రోజానే కాదు.. ప్రత్యేక హోదాకు డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలపైనా సస్పెన్షన్ వేటు

అమరావతిలో నూతన అసెంబ్లీ అన్యాయానికి అసెంబ్లీగా చరిత్రలో నిలిచిపోనుందా. అంటే అవునంటూ సంకేతాలు బలంగా వినపడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కక్షగట్టిన ఎమ్మెల్యే రోజాపై సంవత్సరం పాటు సస్పెన్షన్ పొడిగింపు తప్పదన్నది లీక్ ఇచ్చిన తెదేపా వర్గాలు గత అసెంబ్లీలో ప్రత్య

అమరావతిలో నూతన అసెంబ్లీ అన్యాయానికి అసెంబ్లీగా చరిత్రలో నిలిచిపోనుందా. అంటే అవునంటూ సంకేతాలు బలంగా వినపడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కక్షగట్టిన ఎమ్మెల్యే రోజాపై సంవత్సరం పాటు సస్పెన్షన్ పొడిగింపు తప్పదన్నది లీక్ ఇచ్చిన తెదేపా వర్గాలు గత అసెంబ్లీలో ప్రత్యేక హోదాకు డిమాండ్ చేసిన వైకాపా ఎమ్మెల్యేలను కూడా సస్పెన్షన్ చేయాలని నిర్ణయించినట్లు లీకులు ఇచ్చాయి. అసెంబ్లీ నుంచి ఇప్పటికే ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజాను మరింత ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఆమె సస్పెన్షన్‌ గడువు పూర్తయినా, మరో ఏడాది పాటు సభకు రాకుండా చేయాలనే కుట్రలో భాగంగా మళ్లీ ఏడాది పాటు సస్పెన్షన్‌లో ఉంచాలని ఏపీ శాసనసభా ప్రివిలేజస్‌ కమిటీ నిర్ణయించినట్లు ప్రభుత్వ పెద్దల నుంచి ఓ వర్గం మీడియాకు లీకులు అందాయి. 
 
శనివారం అమరావతిలోని కొత్త అసెంబ్లీలో తొలిసారిగా సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని అధికార పక్షం లీకులిచ్చింది. ప్రత్యేక హోదా సాధన కోసం పాత అసెంబ్లీలో పట్టుబట్టిన పలువురు ఎమ్మెల్యేలను కూడా ఆరు నెలల పాటు శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలని కూడా ఈ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు సిద్ధం చేసిన నివేదికను శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావుకు సమర్పించినట్లు తెలిసింది. ఈ నివేదిక ఈ నెల 7వ తేదీన సభ ముందుకు రావచ్చని భావిస్తున్నారు. 
 
కమిటీ చైర్మన్‌ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి అందరూ టీడీపీ సభ్యులే హాజరయ్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి ఏకైక సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అసెంబ్లీ సిబ్బంది కేవలం ఒక్క రోజు ముందు అదీ సాయంత్రం ఫోన్‌ చేసి శనివారం ప్రివిలేజస్‌ కమిటీ సమావేశం జరుగుతోందని సమాచారం ఇచ్చారు. ఇంత తక్కువ వ్యవధిలో సమాచారం ఇవ్వడం వల్ల తాను రాలేక పోతున్నానని ఆయన వారికి చెప్పారని తెలిసింది. దీంతో సమావేశంలో ఉన్న టీడీపీ సభ్యులు వారికి నచ్చిన రీతిలో నివేదిక సిద్ధం చేశారని సమాచారం.
 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంపై రోజా గట్టిగా మాట్లాడినందుకు 2015 డిసెంబర్‌ 18వ తేదీన ఆమెపై ఏడాది పాటు అసెంబ్లీకి హాజరు కాకుండా సస్పెన్షన్‌ వేటు వేశారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపి వేసింది. ఆ తర్వాత  సుప్రీంకోర్టులో ఆమె న్యాయ పోరాటం చేశారు. రోజా ఇచ్చే లేఖను పరిగణనలోకి తీసుకుని మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను సుప్రీంకోర్టు అప్పట్లో నిర్దేశించింది. ఆ మేరకు ఆమె లేఖ ఇచ్చిన తర్వాత ప్రివిలేజస్‌ కమిటీ ఎదుట హాజరై వివరణ కూడా ఇచ్చారు. అయితే ఎలాగైనా సస్పెన్షన్‌ కొనసాగించాలని పట్టుదలతో ఉన్న ముఖ్యనేత ఆ మేరకు సూచనలు చేసినట్లు సమాచారం.