తిరుమల భక్తురాలికి పాము కాటు, ఫేక్ న్యూస్‌కి ఫ్యాక్ట్ చెక్
ప్రజల్లోకి ఫేక్ న్యూస్‌ను ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడిస్తోంది. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ప్రభుత్వం పైన బురద చల్లే వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆదివారం నాడు తిరుమల క్యూలైన్లో భక్తురాలు పాము కాటుకు గురి అయినట్లు కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలియజేసింది. సోషల్ మీడియా ద్వారా దీనిపై స్పష్టత ఇచ్చింది.
తిరుమలలో ఆరోజు వాస్తవానికి జరిగింది ఏమిటంటే వరంగల్‌కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం (ఫిబ్రవరి 22, 2026) రాత్రి స్వామి దర్శనం కోసం టాక్సీలో ఎస్వీ మ్యూజియం వద్దకు వచ్చారు. ఆర్.బి. సెంటర్ పార్కింగ్ ఏరియా వద్దకు రాగానే తన కాలికి పసుపు రాసుకునే ఉద్దేశ్యంతో మౌనిక కారు నుంచి క్రిందకు దిగారు. ఆ సమయంలో తన కాలికి ఏదో తాకడంతో ఆమె భయంతో గట్టిగా అరిచారు.
వెంటనే ఆమె భర్త శరత్ బాబు వెతికి చూడగా అక్కడ ఒక పాము పిల్ల కనిపించింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మౌనికను తిరుమల లోని అశ్విని హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. భక్తురాలిని పరిశీలించిన డాక్టర్లు ఆమె పాముకాటుకు గురి కాలేదని నిర్ధారించారు. అయినప్పటికీ భక్తురాలి క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తగా ఆమెను తిరుపతిలోని స్విమ్స్‌లో చేర్చడం జరిగింది.
Fake Alert
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) February 23, 2026
తిరుమల క్యూలైన్ లో భక్తురాలు పాము కాటుకు గురి అయినట్లు కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. వాస్తవానికి జరిగింది ఏమిటంటే వరంగల్ కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం (ఫిబ్రవరి 22, 2026) రాత్రి స్వామి దర్శనం కోసం టాక్సీలో ఎస్వీ మ్యూజియం వద్దకు వచ్చారు.… pic.twitter.com/24nH2BFX0r
స్విమ్స్ డాక్టర్లు కూడా మౌనిక పాము కాటుకు గురికాలేదని చెప్పారు. పైగా విచారణలో అక్కడ కనిపించిన పాము విషరహిత సర్పంగా తేలింది. ఘటన జరిగిన వెంటనే టీటీడీ సిబ్బంది స్పందించిన తీరుకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలియజేసారు. సోమవారం ఉదయం ఆ దంపతులు స్వామిని దర్శించుకున్నారు. జరిగింది ఇది. కాబట్టి కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాలను భక్తులు నమ్మకండి.
