శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2016 (12:50 IST)

తిరుపతిలో కిలాడీ లేడీ... రూ.అర కోటితో పరార్‌...

అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని రూ.అర కోటి డబ్బులను మింగేసింది ఓ కిలాడీ లేడి. మహిళలు లక్షాధికారులు కావాలంటే ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతుంటే ఇలాంటి మాయలేడీల కారణంగా మహిళలు భిక్షాధికారులు అయిపోతున్నారు.

అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని రూ.అర కోటి డబ్బులను మింగేసింది ఓ కిలాడీ లేడి. మహిళలు లక్షాధికారులు కావాలంటే ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతుంటే ఇలాంటి మాయలేడీల కారణంగా మహిళలు భిక్షాధికారులు అయిపోతున్నారు. చదువు రాకపోవడం వల్ల తనను నమ్మి డబ్బులు పెట్టిన పాపానికి వందల మందిని నిలువునా ముంచింది స్వర్ణలత అనే మహిళ. సంఘమిత్ర పేరుతో పొదుపు సంఘానికి లీడర్‌గా వ్యవహరిస్తూ డబ్బులు కొట్టేసిన వైనం సంచలనం రేపుతోంది.
 
తెలియని మహిళలను అభ్యుదయ పరిచి పొదుపు పద్దతులను నేర్పించాల్సిన అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడడంతో పొదుపు సంఘాల్లో పెద్ద అవినీతి బాగోతం బయటపడింది. చదువురాని మహిళలను గ్రూపుల్లో చేర్చుకుని వారికి తెలియకుండానే వారి పేర్లతో లక్షల్లో లోన్లు తీసింది సంఘమిత్ర గ్రూపుకు లీడర్‌గా వ్యవహరిస్తున్న తిరుపతికి చెందిన స్వర్ణలత. 
 
ఒక సంఘంలో ఉండే ప్రతి సభ్యుల అనుమతితోనే ప్రభుత్వం వారికి లోన్లు మంజూరు చేస్తుంది. అలా మంజూరు చేసిన డబ్బును పది మంది సమానంగా పంచుకుని నెలకు కొంత చొప్పున తిరిగి చెల్లిస్తూ ఉంటారు. ఇలా తీసుకున్న మొత్తాన్ని సంవత్సరంలోపు చెల్లిస్తే దానిపైన ఎలాంటి వడ్డీ ఉండదు. అందువల్ల మహిళలకు ఇది ఎంతో ఆసరాగా ఉంటుందని ప్రభుత్వం ఈ పథకాన్ని పెట్టింది. అయితే అమాయక మహిళలను ఆసరాగా చేసుకుని ఇలాంటి వాటిల్లో కూడా మోసాలకు తెరతీస్తున్నారు. అందుకు తిరుపతిలో జరిగిన ఈ అవినీతి బాగోతమే నిదర్శనం. 
 
ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు ఈ ప్రక్రియలో స్వర్ణలతకు అన్ని విధాలుగా సహకరించినట్లు తెలుస్తోంది. వారి పేర్లతో లోన్లు తీసుకోవడమే కాకుండా గతంలో తీసుకున్న లోన్లకు సంబంధించిన నెలవారీ కంతులకు చెల్లించే సొమ్మును కూడా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయకుండా దాచుకున్నారు. దీంతో మీరు తీసుకున్న లోను తీయలేదంటూ అధికారులు మహిళలకు చెప్పడంతో వాళ్లు లబోదిబోమంటున్నారు. తీరా ఏం జరిగిందని ఆరాతీస్తే ఆ గ్రూపులోని మహిళల పాసుపుస్తకాలన్నీ తన వద్దే ఉంచుకుని అధికారుల సహకారంతో స్వర్ణలత రూ.50 లక్షల వరకు నొక్కేసిందన్న విషయం బట్టబయలైంది. 
 
దీనిపై పిడి స్థాయి అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే ఆ మహిళ ఈ బాగోతం బయట పడిన వెంటనే పరారైంది. అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. తమతో మంచిగా ఉంటూనే మాయమాటలు చెప్పి తమను అప్పుల పాలు చేసిన స్వర్ణలతను కఠినంగా శిక్షించాలంటూ బాధిత మహిళలు కోరుకుంటున్నారు.