1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
  4. Your Weekly Horoscope, November 29- December 05, 2026

29-11-2026 నుంచి 05-12-2026 వరకు వార రాశి ఫలితాలు- భార్యాభర్తల మధ్య స్వల్ప కలహం.

Weekly Horoscope
Weekly Horoscope
మేషం: అశ్విని, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం
ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. అవకాశాలు కలిసివస్తాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. సంతాన సౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. బుధవారం నాడు ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆహ్వానం అందుకుంటారు. భార్యాభర్తల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. ఆరోగ్యం జాగ్రత్త. క్రమం తప్పకుండా ఔషధ సేవనం పాటించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం, వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. శుభకార్యానికి హాజరవుతారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. సమయస్ఫూర్తితో మెలుగుతారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. శనివారం నాడు ముఖ్యులను కలిసినా ప్రయోజనం ఉండదు. సన్నిహితుల ప్రోద్బలంతో ముందుకు సాగుతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. వ్యాపారాలకు పథకాలు రూపొందిస్తారు. షాపుల అలంకరణ ఆకట్టుకుంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితులను సంప్రదించండి. భార్యాభర్తల మధ్య దాపరికం తగదు. ఆర్థికంగా బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులతో తరచు సంభాషిస్తారు. ఆదివారం నాడు కొందరి రాక చికాకుపరుస్తుంది. పనులు, కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిరు వ్యాపారాలకు ఆశాజనకం. ఉద్యోగ విధుల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యంలో పాల్గొంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి. తొందరపాటుతనం వల్ల నష్టాలు, కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. భేషజాలకు పోవద్దు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పెట్టుబడులు కలిసిరావు, పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. భార్యాభర్తల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలు చేపడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. మంగళవారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. మీ పథకాలు, ప్రణాళికలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. సాఫ్ట్‌వేర్ విద్యార్థులకు సదవకాశాలు లభిస్తాయి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. దీర్ఘకాలిక సమస్యలు సద్దుమణుగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. రావలసిన ధనం అందుతుంది. ఇతరుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. సోమవారం నాడు అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు నగదు బహుమతి, సహోద్యోగులతో జాగ్రత్త. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ వారం అనుకూలదాయకం. మీ కృషి ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. కొత్త సమస్య తలెత్తే సూచనలున్నాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ మాటలు జారవేసే వారున్నారు, జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఒక శుభలేఖ ఆశ్చర్యం కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్లకండి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యం నెరవేరుతుంది. సమర్థతను చాటుకుంటారు. సంప్రదింపులు పురోగతితో సాగుతాయి. ఆశ వదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త, ఎవరినీ అతిగా నమ్మవద్దు. కొందరి తీరుపై అనుమానం కలుగుతుంది. సమయస్ఫూర్తితో మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. వివాహ యత్నం తీవ్రంగా సాగిస్తారు. సంతానం అత్యుత్సాహం అదుపు చేయండి. పెద్దలతో సంభాషిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు ప్రలోభం తగదు. ప్రైవేట్ ఉద్యోగులకు మార్పులు అనుకూలిస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఆలోచన లేని నిర్ణయం తగదు. నిపుణులను సంప్రదించండి. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆదివారం నాడు పనులు ముందుకు సాగుతాయి. మీ చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. స్నేహ సంబంధాలు బలపడతాయి. గృహ మార్పు అనివార్యం. సొమ్ము, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. గృహ అవసరాలు తీర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారంలో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ప్రముఖులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
 
ధనుస్సు: మూల, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. రావలసిన ధనం అందుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మంగళవారం అప్రమత్తంగా ఉండాలి. మంచి చేయబోతే ఎదురుదెబ్బ తగులుతుంది. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. స్నేహ సంబంధాలు విస్తరిస్తాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప కలహం. సామరస్యంగా సమస్య పరిష్కరించుకోండి. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుట పడతారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. వాహనదారులకు దూకుడు తగదు.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
వ్యవహార లావాదేవీలతో తీరిక ఉండదు. లక్ష్యానికి చేరువవుతున్నారు. నిరుత్సాహం వీడి యత్నాలు కొనసాగించండి. సలహాలు, సూచనలు పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వస్తువులపై దృష్టి పెడతారు. ఖర్చులు విపరీతం, ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. గురువారం నాడు ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. సంతానం ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒడిదుడుకులను తట్టుకుంటారు. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకలకు హాజరవుతారు.
 
కుంభం: ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. పొదుపు పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తుల వద్ద మదుపు చేయడం క్షేమం కాదు. వివాహ యత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. పనులు వేగవంతమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వం స్వీకరిస్తారు. ప్రతి విషయంలోనూ బాధ్యతగా మెలగాలి. మీ అలక్ష్యం ఇబ్బందుకు దారితీస్తుంది. గృహాలంకరణ పట్ల మక్కువ కలుగుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. శనివారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వ్యవహార జయం, కుటుంబ సౌఖ్యం ఉన్నాయి. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. స్థిరాస్తి ద్వారా ధనం అందుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. సోమవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. కొందరి రాక వల్ల మీ కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుంది. శుభలేఖ అందుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉల్లాసంగా కాలం వెళ్లదీస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్నీ నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
పరమేశ్వరుడిని దేవతలు, రాక్షసులు ఇద్దరూ కొలుస్తారు, ఎందుకు?