1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Ex-Tamil Nadu BJP chief Annamalai likely to be nominated to Rajya Sabha from Andhra Pradesh

అన్నామలైకు బంపర్ ఆఫర్... ఏపీ నుంచి బీజేపీ కోటాలో రాజ్యసభ సీటు

annamalai
తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ పోలీస్ అధికారి కె.అన్నామలైకు బంపర్ ఆఫర్ వరించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బీజేపీ కోటాలో రాజ్యసభలోకి అడుగుపెట్టనున్నారు. ఏపీలో జూన్ నెలలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీకానున్నాయి. ఈ నాలుగింటిలో ఒక స్థానం బీజేపీకి వెళ్లనుంది. ఆ స్థానాన్ని కె.అన్నామలైకు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. 
 
తమిళనాడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా అన్నామలై గుర్తింపు పొందారు. ఆయనను పెద్దల సభకు పంపేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు  సమాచారం. ఏపీలో జూన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమికి ఈ నాలుగు స్థానాలను దక్కించుకునే సంఖ్యాబలం ఉంది. పొత్తులో భాగంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం టీడీపీకి రెండు, జనసేన, బీజేపీలకు చెరొక స్థానం కేటాయించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు డి.మాధవ్ మధ్య ఈ విషయంపై చర్చలు జరిగినట్లు సమాచారం.
 
ఈ నేపథ్యంలో బీజేపీకి దక్కే ఒక్క స్థానాన్ని అన్నామలైకి కేటాయించాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆయనకు, ఈ రూపంలో జాతీయ స్థాయిలో కీలక పదవి ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
నిజానికి గతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పుడు కూడా ఏపీ కోటాలో అన్నామలై పేరు వినిపించింది. కానీ, అప్పుడు ఏపీకే చెందిన బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణకు అవకాశం దక్కింది. దీంతో ఈసారైనా ఆయనకు అవకాశం దక్కుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ప్రేమ పేరుతో వంచన... తండ్రిని మోసం చేసి ప్రియుడికి కిలో బంగారం ఇచ్చిన యువతి