గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 29 జనవరి 2020 (17:46 IST)

టిక్ టాక్‌తో స్నేహితులయ్యారు, వ్యభిచారం చేయమని ఇద్దరు మగాళ్ళను పంపిస్తే?

కుటుంబ సభ్యులకన్నా ఎక్కువగా స్నేహితులనే నమ్మిందామె. అయితే చివరకు స్నేహితులే ఆమెను మరింత అంధకారంలోకి నెట్టేశారు. వ్యభిచారం చేయాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తట్టుకోలేక బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. 
 
ఆనందంగా సాగుతున్న ఆమె జీవితం ఒక్కసారిగా అంధకారమైపోయింది. జీవితాంతం అండగా ఉంటాడునుకున్న భర్తను మృత్యువు కబళించింది. దీంతో ముగ్గురు పిల్లలను పోషిస్తూ బతుకును భారంగా జీవితాన్ని సాగిస్తోంది. పీకల్లోతు బాధల్లో మునిగితేలుతున్న ఆమెకు టిక్‌టాక్ కొంచెం హాయిని కలిగించింది. అందులో పరిచయమైన ముగ్గురు స్త్రీలను నిజమైన స్నేహితులుగా భావించింది. వారికి తన కష్టాలన్నీ చెప్పుకుంది.  
 
సెంజి సమీపంలోని సత్యమంగళం గ్రామానికి చెందిన మనోహరన్‌, కడల్‌కన్ని దంపతులకు ముగ్గురు పిల్లలు. భర్త మృతి చెందడంతో ఆమె, పిల్లలతో కలసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమెకు ఇటీవల టిక్ టాక్ యాప్‌లో చెన్నైకి చెందిన సుమతి, లత, కవిత అనే ముగ్గురు పరిచయమై స్నేహితులుగా మారారు. కొంతకాలం ఆమెతో స్నేహంగా ఉన్న ఆ మహిళలు తర్వాత ఆమెను వేధించడం మొదలుపెట్టారు.
 
వ్యభిచారం చేయాలని ఆమెను ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఇద్దరు పురుషులను పంపి 2 లక్షలు ఇవ్వాలని, లేదంటే కిడ్నాప్‌ చేసి హత్య చేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
అయితే దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారి నుంచి బెదిరింపులు అధికం కావడంతో తట్టుకోలేని కడల్‌కన్ని ఇంట్లో ఉరేసుకుంది. వెంటనే గుర్తించిన కుటుంబీకులు ఉరితాడు తొలగించి చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కడల్‌కన్ని కొట్టుమిట్టాడుతోంది.