ప్రేమించిన యువతి మోసం చేసిందనీ బాడీ బిల్డర్ సూసైడ్
బెంగుళూరు నగరంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేని బాడీబిల్డర్ ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనకు మరో వ్యక్తితో నిశ్చితార్థమైందని చెపుతూ పెళ్లి చీర, పెళ్ళి పత్రిక చూపించడంతో తీవ్ర మనస్తాపం చెందిన బాడీబిల్డర్ అర్ధాంతరంగా తనువుచాలించాడు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరు మహాలక్ష్మి లేఅవుట్‌కు చెందిన కిరణ్ (26) అనే వ్యక్తి జిమ్ ట్రైనర్‌గా, బాడీ బిల్డర్‌గా రాణిస్తున్నాడు. గత మూడేళ్ళుగా ఆయన ఓ యువతిని గాఢంగా ప్రేమిస్తూ వచ్చాడు. అయితే, శనివారం సాయంత్రం ప్రియురాలిని కలిసినపుడు ఆమె.. తనకు మరో వ్యక్తితో నిశ్చితార్థమైందని పేర్కొంటూ పెళ్ళి చీరతో పాటు వెడ్డింగ్ కార్డును చూపించింది.
ఈ అనూహ్య పరిణామంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన కిరణ్.. ఇంటికి తిరిగి వచ్చి తన గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా కిరణ్ ఫ్యానుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహం, సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ప్రియురాలు, ఆమె తల్లే కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.