ఉంగరం కొనేందుకు వెళ్లి అనంతలోకాలకు చేరుకున్న తల్లీకొడుకు
బంగారు ఉంగరం కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి బయలుదేరిన తల్లీకొడుకులు అనంతలోకాలకు చేరుకున్నారు. ద్విచక్రవాహనంపై చీమకుర్తికి వచ్చారు. పని పూర్తి చేసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. ఇంతలో ద్విచక్ర వాహనం, లారీ వారి పాలిట మృత్యువుగా మారాయి. పోలీసుల వివరాల మేరకు..
మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన వి.మల్లీశ్వరి(52) కుమారుడు శివకృష్ణ(23)తో కలిసి ఉంగరం కొనేందుకు శనివారం ఉదయం చీమకుర్తికి వచ్చారు. ఓ దుకాణంలో ఉంగరం తయారు చేసేందుకు మోడల్ చూపి అడ్వాన్సుగా రూ.10 వేలు చెల్లించి తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు.
ఒంగోలు-కర్నూలు రహదారిలో యల్లయ్య నగర్ పెట్రోలు బంకు సమీపంలో ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన ద్విచక్రవాహనం వీరి వాహనాన్ని ఢీకొంది. మల్లీశ్వరి, శివకృష్ణ రహదారిపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి గ్రానైట్ బండలతో వచ్చిన లారీ వీరిపై వెళ్లడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
సీఐ డి.ప్రసాద్, ఎస్సై సంపత్ కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరికంటే ముందుగా ఒంగోలు నుంచి తన ద్విచక్ర వాహనంపై చిమటకు వెళ్తున్న మల్లీశ్వరి భర్త సుబ్బారావుకు ప్రమాద వార్త తెలియడంతో వెంటనే వెనక్కి వచ్చారు. మల్లీశ్వరి, శివకృష్ణల మృతదేహాలను చూసి బోరున విలపించారు.
