ప్రియురాలు మోసం చేసిందని పురుగుల మందు తాగిన ప్రియుడు
తెలంగాణ రాష్ట్రంలో ఓ ప్రియుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో ఓ యువతి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లిలో చోటుచేసుకుంది.
స్తానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి శ్రీకాంత్(26) చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. కొంతకాలంగా ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌కు చెందిన ఓ యువతి, శ్రీకాంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతి కుటుంబ సభ్యులు వారి అవసరాల నిమిత్తం పలుమార్లు శ్రీకాంత్ వద్ద డబ్బులు తీసుకున్నారు.
ఇటీవల యువతి తల్లిదండ్రులు కొత్తపల్లికి వచ్చి తమ కుమార్తె విషయం మర్చిపోవాలని శ్రీకాంత్‌ను హెచ్చరించారు. కాదని ఇబ్బందులకు గురిచేస్తే కేసు పెడతామని బెదిరించారు. మరుసటి రోజు నుంచి శ్రీకాంత్ ఫోన్ చేసినా.. యువతి తీయలేదు. అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం ఇంట్లోని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
గమనించిన కుటుంబ సభ్యులు నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి.. అక్కడి నుంచి హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. ప్రేమ పేరిట యువతిని మోసం చేయడంతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని శ్రీకాంత్ తల్లి ఇమ్మడి నవీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
