ప్రియుడు మోజులో పడి భర్త దుప్పట్లోకి నాగుపాముని పంపి హత్య చేసిన భార్య
వివాహేతర సంబంధం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రియుడు మోజులో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను హత్య చేసింది కట్టుకున్న భార్య. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లా హస్తినాపురంలో చోటుచేసుకున్నది. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి.
35 ఏళ్ల అతుల్ పన్వార్, దామిని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతడు కృష్ణా కిడ్స్ పబ్లిక్ స్కూల్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఈ స్కూలు బస్సు నడిపేందుకు తుషార్ అనే యువకుడు పనిలో చేరాడు. అతడు ప్రతిరోజూ బస్సును తీసుకుని వెళ్లేందుకు ఇంటికి వస్తూ మెల్లగా దామినితో సన్నిహిత సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఐతే తమ సంబంధానికి భర్త అడ్డుగా వున్నాడనీ, అతడిని ఎలాగైనా అంతమొందించాలని ప్రియుడు తుషార్ తో కలిసి ప్రణాళిక వేసింది దామిని. ఆ ప్రకారం ఇంటికి వచ్చిన భర్తకు భోజనంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది.
అతడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. వెంటనే విషయాన్ని ప్రియుడికి చేరవేసింది. తుషార్ అప్పటికే ఓ సంచీలో నాగుపామును పెట్టుకుని సిద్ధంగా వున్నాడు. దామిని ఫోన్ చేయగానే అక్కడికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి అతుల్ పన్వార్ కప్పుకున్న దుప్పట్లోకి నాగుపామును వదిలారు. అది కాటు వేయడంతో గాఢ నిద్రలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు అతుల్ పన్వార్. ఐతే అతుల్ తరపు కుటుంబం అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు తమదైన శైలిలో దామిని ఫోన్ డేటాను విశ్లేషించడంతో వాస్తవం బైటపడింది. నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకి పంపారు.
