బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఎం
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (15:06 IST)

అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు.. రాష్ట్ర ఆర్థికశాఖ ఇలా తయారయ్యిందే!

పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఈ శాఖ చెల్లించకపోగా.. ఆయా శాఖలు రుణంగా తెచ్చుకున్న నిధులను కూడా వినియోగించు కోనివ్వకుండా పక్కన పెట్టేస్తోంది. ఫలితంగా ఉత్తినే వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటీ రెండూ లక్షలు కాదు... రోజుకు ఏకంగా రూ.58 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే రూ.30 కోట్లను వడ్డీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించుకుంది. 
 
జలవనరుల శాఖ విషయంలో ఆర్థికశాఖ వ్యవహరిస్తున్న ఈ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెండింగ్‌ బిల్లులు గుదిబండలా తయారై ప్రాజెక్టులు ముందుకు కదలక నానా అవస్థలు పడుతోన్న జలవనరులశాఖ కొంతకాలం క్రితం రూరల్‌ ఎలక్ర్టిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) నుంచి రూ.2వేల కోట్లు అప్పు తెచ్చుకుంది. ఆ డబ్బులు జలవనరుల శాఖకు అంది నెల రోజులు దాటిపోయింది. 
 
వీటికి వడ్డీ రేటు 10.75 శాతం. అంటే రోజుకు రూ.58 లక్షల వడ్డీ చెల్లించాలి. ఇప్పటి వరకూ వాటిని జలవనరులశాఖ వినియోగించుకోలేదు. వడ్డీ రేటు ఎక్కువంటూ ఆర్థిక శాఖ పక్కనపెట్టేయడంతో ఆ నిధులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వడ్డీ మాత్రం కొండలా పేరుకుపోయింది. ఆర్థికశాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఆ రూ.2వేల కోట్లపై వడ్డీ రూ.30 కోట్లు జమ చేశారు.
 
సంక్షేమంపైనే దృష్టి
చంద్రబాబు హయాంలో కూడా రూ.5వేల కోట్లు అప్పు తీసుకునేందుకు ఆర్‌ఈసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ, వడ్డీరేటు ఎక్కువ కావడం వల్ల అప్పట్లో ఆర్‌ఈసీ నుంచి రుణం తీసుకోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక కష్టాలు రెట్టింపవడంతో పెండింగ్‌ బిల్లులన్నీ పక్కన పెట్టి ఉన్న నిధులను, తెచ్చిన రుణాలను వేతనాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలకు సరిపెడుతున్నారు. 
 
ఇప్పటికే ఆర్థికశాఖ చేసిన అప్పులు రూ.52వేల కోట్లకు చేరుకోగా, మరో రూ.3,800 కోట్లు బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పు తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది జలవనరుల శాఖకు బడ్జెట్లో రూ.16వేల కోట్లు కేటాయించినా ఇప్పటికీ రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో జలవనరులశాఖలో బిల్లులు పెండింగ్‌ ఉన్న కాంట్రాక్టర్లు పనులు చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. 
 
జలవనరుల శాఖ కార్యకలాపాలపై ఇటీవల సమీక్షించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఏఐఐబీ, ఆర్‌ఈసీ నుంచి రుణాలు తీసుకుని ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకెళ్లాలని నిర్దేశించారు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ ఆర్‌ఈసీ నుంచి రూ.2వేల కోట్ల రుణం తీసుకుంది. జలవనరుల శాఖలో పెండింగ్‌ బిల్లులు రూ.5వేల  కోట్ల వరకూ ఉన్నప్పటికీ ఈ రూ.2వేల కోట్లను వినియోగించుకుని బిల్లులు చెల్లించడంలో ఆ శాఖ విఫలమవుతోంది. సీఎ్‌ఫఎంఎస్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చాక అన్ని శాఖల బిల్లులు దాని పరిధిలోకి వచ్చాయి. 
 
ఈ బిల్లులను రాష్ట్ర సంచిత నిధి (కన్సాలిడేటెడ్‌ ఫండ్‌) నుంచి మాత్రమే చెల్లించే వెలుసుబాటు ఉంటుంది. దీంతో ఏ శాఖ రుణం తెచ్చుకున్నా సంచిత నిధికి జమ చేస్తూ ఉంటాయి. దీనికి ఆర్థికశాఖ ఆమోదం తప్పనిసరి. జలవనరుల శాఖ ఆర్‌ఈసీ నుంచి తెచ్చిన రూ.2వేల కోట్లను రాష్ట్ర సంచిత నిధిలో జమ చేసే అంశంపై ఆర్థికశాఖ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. బ్యాంకులిచ్చే రుణాలతో పోల్చితే ఈ రూ.2వేల కోట్లపై వడ్డీ అత్యధికంగా ఉందంటూ ఆర్థికశాఖ తటపటాయిస్తోంది. 
 
ఆర్‌ఈసీ నుంచి రుణం తీసుకునే ముందు జలవనరులశాఖ ఈ వడ్డీరేట్ల గురించి ఆర్థికశాఖకు సమాచారం ఇచ్చిందో లేదో తెలియడం లేదు. వచ్చే నెలాఖరుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అప్పులు రూ.60వేల కోట్లకు చేరుకునే అవకాశాలు లేకపోలేదు.
 
రూ.3,800 కోట్లకు కేంద్రం ఓకే
జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.15వేల కోట్లు బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డి సెంబరులో కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో జనవరిలో రూ.7,428 కోట్ల రుణానికి అంగీకారం తెలిపిన కేంద్రం... ఇప్పుడు తాజాగా రూ.3,800 కోట్లకు ఆ మోదం తెలిపింది. దీంతో ఏపీ తీసుకోనున్న రుణాల మొత్తం రూ.39,000 కోట్లకుపైగా చేరింది.