ముచ్చటిగా మూడోసారి... విస్తరణలో మోడీ - షా మార్క్
కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ముచ్చటగా మూడోసారి జరిగింది. తొలి రెండు దఫాల్లో కంటే తాజాగా చేపట్టిన విస్తరణ దూరదృష్టితో కూడుకునివుంది. 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడీ
కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ముచ్చటగా మూడోసారి జరిగింది. తొలి రెండు దఫాల్లో కంటే తాజాగా చేపట్టిన విస్తరణ దూరదృష్టితో కూడుకునివుంది. 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఫలితంగాననే తన మంత్రివర్గంలోకి కొత్తగా 9 మందికి అవకాశం కల్పించారు. మరో నలుగురు సీనియర్ మంత్రులకు పదోన్నతి కల్పించి కేబినెట్ హోదాఇచ్చారు.
త్వరలో జరగనున్న రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ మంత్రివర్గాన్ని విస్తరించారు. పనితీరు బాగాలేని మంత్రులను రాజీనామా చేయమని కోరడంతో.. ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అశ్వినికుమార్ చౌబే, గజేంద్ర సింగ్ షెకావత్, శివప్రతాప్ శుక్లా, హర్దీప్‌సింగ్‌పూరి, సత్యపాల్‌సింగ్, రాజ్‌కుమార్‌సింగ్, అల్ఫోన్స్ కన్నన్‌థనం, వీరేంద్రకుమార్, అనంత్‌కుమార్ హెగ్డే కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్న నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నఖ్విలకు కేబినెట్ హోదా కల్పించారు.
దేశ 15వ ప్రధానిగా నరేంద్ర మోడీ 26 మే 2014లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మంత్రివర్గంలోకి 45 మందిని తీసుకున్నారు. వీరిలో 23 మందికి కేబినెట్.. 10 మందికి స్వతంత్ర హోదా కల్పించారు. 12 మందికి సహాయ మంత్రి పదవులు దక్కాయి.
2014 నవంబరు నెలలో ఆయనత తొలిసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. 21 మంది కొత్త మంత్రులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నలుగురికి కేబినెట్ హోదా కల్పించగా.. ముగ్గురిని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సహాయ మంత్రులుగా నియమించారు. మిగతా 14 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలి విస్తరణలో 45 ఉన్న మంత్రుల సంఖ్య రెండో విస్తరణతో 66కి చేరింది.
ఆ తర్వాత 2016 జులైలో ప్రధాని రెండోసారి మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టారు. ఐదుగురు మంత్రులను తన జట్టు నుంచి తప్పించి.. ఇద్దరి హోదాలు తగ్గించారు. కొత్తగా 19 మందికి చోటు కల్పించారు. ముచ్చటగా మూడోసారి ఇపుడు చేపట్టారు. ఈ విస్తరణ కోసం ఏడుగురు మంత్రులు రాజీనామా చేయగా.. కొత్తగా 9 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో మోడీ మంత్రివర్గం సంఖ్య 75కు చేరింది. మంత్రివర్గంలో గరిష్టంగా 81 మందికి అవకాశం ఉంది.