కర్వా చౌత్ వ్రతం చేయలేదని ఆగ్రహం - భార్యపై భర్త ఫిర్యాదు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన కేసు ఒకటి నమోదైంది. రాష్ట్రంలోని కర్వా చౌత్ పండుగ సందర్భంగా భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. తన కోసం భార్య కర్వా చౌత్ వ్రతం చేయలేదని, చంద్రుడికి పూజ కూడా చేయలేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. ఈ సారి కూడా పూజ చేయకపోతే విడాకులు ఇస్తానంటూ భార్యను బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
శివపురి జిల్లా బిజ్రావన్ గ్రామానికి చెందిన బరేలాల్ ఆదివాసీ తన భార్య మిథిలేశ్ ఆదివాసీపై బదర్వాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భార్య తనకు నమ్మకంగా ఉడంటం లేదని తన కోసం ఉపవాసం ఉండటానికి నిరాకరించిందని ఆరోపించారు. కర్వా చౌత్ సందర్భంగా చంద్రుడిని చూపి తన దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించాలని కోరినా ఆమె పట్టించుకోలేదని ఫిర్యాదులో రాశాడు. అంతేకాకుండా, భార్య తనను చంపాలని చూస్తోందని కూడా ఆరోపించాడు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన కోలారస్ సబ్ డివిజినల్ పోలీస్ అధికారి సంజయ్ మిశ్రా.. మహిళా పోలీస్ అధికారి సహాయంతో దంపతులకు కౌన్సిలింగ్ నిర్వహించి, వారి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

