1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Inflation Angst Drives US Long-Dated Bond to 2007 High

అమెరికాలో పడగ విప్పిన ద్రవ్యోల్బణం - గగ్గోలు పెడుతున్న ప్రజలు

Inflation
అమెరికాలో ద్రవ్యోల్బణం పడగ విప్పింది. దీంతో అమెరికా ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ద్రవ్యోల్బణం పరిగిపోవడంతో అన్ని రకాల ఆహార, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. దీంతో అమెరికా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాసోలిన్ (పెట్రోల్), కిరాణా సరుకులు, ఇతర నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజల జీవనం కష్టతరంగా మారింది. షిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం గత 12 నెలల్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఏకంగా 3.8 శాతం పెరిగింది. ఇది 2023 తర్వాత అత్యధిక వార్షిక పెరుగుదల కావడం గమనార్హం. కేవలం ఏప్రిల్ నెలలోనే ద్రవ్యోల్బణం 0.6 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ సంక్షోభాలు, ఇంధన సరఫరాలో అంతరాయాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
 
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచంలోనే కీలకమైన ఇంధన రవాణా మార్గం హర్మూజ్ జలసంధి గుండా చమురు సరఫరాలో ఏర్పడిన ఆటంకాల వల్ల ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికా కార్మిక గణాంకాల బ్యూరో (బీఎల్ఎస్) ప్రకారం గత ఏడాది కాలంలో ఇంధన ధరలు 17.9 శాతం పెరగ్గా, ఒక్క గ్యాసోలిన్ ధరలే 28.4 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా గ్యాసోలిన్ సగటు ధర గ్యాలన్‌కు 4.50 డాలర్లు దాటింది. రవాణా ఖర్చులు పెరగడం ఆ ప్రభావం దాదాపు అన్ని వస్తువుల ధరలపై పడుతోంది. ట్రక్కుల రవాణా వ్యయం పెరిగితే, దానిని సూపర్ మార్కెట్లు, రిటైలర్లు వినియోగదారులపైనే మోపుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
 
ఇంధన ధరలతో పాటు ఆహార పదార్థాల ధరలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో కిరాణా సరుకుల ధరలు 0.7 శాతం పెరిగాయి. ముఖ్యంగా గొడ్డు మాంసం, కాఫీ, పండ్లు, కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. "ప్రతిదాని ధర పెరిగింది. ఆహారం, గ్యాస్, బట్టలు, ఇంటి అద్దె.. ఇలా ఏది చూసినా పైపైకే పోతోంది" అంటూ అమెరికా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
అన్నింటికంటే ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడం. ఏప్రిల్లో ఉద్యోగుల నిజమైన సగటు గంట వేతనాలు 0.5 శాతం తగ్గాయని బీఎల్ఎస్ తెలిపింది. అంటే.. జీతాలు కాగితంపై పెరిగినట్లు కనిపిస్తున్నా, ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. "డబ్బులు దేనికీ సరిపోవడం లేదు. ఈ లోటును ఎలా భర్తీ చేయాలో అర్థం కావడం లేదు" అని లాస్ ఏంజిల్స్లోలోని ఓ రిటైల్ షాపు ఉద్యోగి డెనిస్ కోన్ వాపోయారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అనవసర ఖర్చులను తగ్గించుకోవడం, క్రెడిట్ కార్డుల వాడకం పెంచడం వంటివి చేస్తున్నారు.
About Writer
ఠాగూర్