గోదావరి పుష్కరాలకు నమూనా ఆలయం.. టిటిడి పాలక మండలిల నిర్ణయం
గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ ఆధ్యాత్మకత ఉట్టి పడేలా చేసే కార్యక్రమాలతో పాటు అక్కడో తిరుమల నమూనా ఆలయాన్ని నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. శనివారం ఉదయం కొలువుదీరిన పాలక మండలి మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
నూతనంగా టిటిడి ఛైర్మన్ గా ఎంపికైన చదలవాడ క్రిష్ణమూర్తి శనివారం ఉదయం 11.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన చదలవాడ గంటన్నరలోపే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించారు. ఆయనతోపాటు 13 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో బోర్డు సమావేశమయ్యింది.
వివిధ అంశాలపై బోర్డు చర్చించింది. ఇందులో భాగంగా మొదట గోదావరి పుష్కరాలలో నమూనా ఆలయాన్ని నిర్మించి అక్కడకు వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కల్గించాలని తీర్మానించారు. అక్కడ నీటి వసతి, ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే తిరుమలలో తలనీలాలను సేకరించడానికి భక్తులకు మరింత నాణ్యమైన బ్లేడ్లను వినియోగించాలని నిర్ణయించారు. అందుకోసం సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్లను కనీసం 75 లక్షలు కొనుగోలు చేయాలని తీర్మానించారు. అనంతరం ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి అన్న దాన సత్రానికి వెళ్ళి భోజనం చేశారు. తిరుగు ప్రయాణమయ్యారు.
