విద్యార్థిగా అప్పుడు.. విఐపిగా ఇప్పుడు..స్వామి సేవలో పాల్గొన్నా.. అఖిలేష్
తాను విద్యార్థిగా ఉన్నప్పుడు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని, ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా స్వామి సేవలో పాల్గొనడం ఆ స్వామి భాగ్యమేనని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఆయన ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
స్వామివారిని దర్శించుకోవటం కోసం శనివారం తిరుమలకు చేరుకున్న యుపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు.ఉదయం విఐపీ దర్శనాల విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు రంగనాయకుల మండపంలో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు.
అనంతరం టీటీడీ అధికారులు నూతన సంవత్సరం క్యాలండర్ డైరీలను అందించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లడుతూ స్వామి కోరిన కోర్కెలు తీర్చే దేవుడని కొనియాడారు. స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని,తనకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన అన్నారు.తిరుమలకు వచ్చే వేలాధిమంది భక్తులకు టీటీడీ మంచి సౌఖర్యాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు.
