శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (14:38 IST)

అత్యంత భయానకంగా లెబనాన్.. ఎక్కడ చూసినా మృతదేహాలు...

లెబనాన్‌ రాజధాని బీరూట్‌ అత్యంత భయానకంగా మారింది. నగరంలోని పోర్టు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన భారీ పేలుళ్లతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. ఎక్కడ చూసినా మృతదేహాలతో బీరూట్‌ మృత్యునగరాన్ని తలపించింది. ఈ ఘటనలో దాదాపు 137 మంది మరణించారు. నాలుగు వేల మందికిపైగా గాయపడ్డారు. 
 
శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. కాగా పోర్టు ప్రాంతంలోని ఓ గోదాములో నిల్వ ఉంచిన 2700 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ వల్లే ఈ పేలుళ్లు జరిగాయని మంత్రి మొహమ్మద్‌ ఫామీ తెలిపారు.
 
2013లో అక్రమంగా రసాయనాలను తరలిస్తున్న ఓ కార్గో నౌకను అధికారులు సీజ్‌ చేసి ఓడలోని అమ్మోనియం నైట్రేట్‌, ఇతర రసాయనాలను గోదాముకు తరలించారు. అప్పటి నుంచి ఆ రసాయనాలు అక్కడే నిల్వ ఉన్నాయని ఫామీ వెల్లడించారు. గతంలో ఎన్నడూ చూడనటువంటి విపత్తును తాము ఎదుర్కొన్నామని లెబనాన్‌ ప్రధాని హసాన్‌ దియాబ్‌ తెలిపారు.
 
పేలుళ్లతో తీవ్రంగా దెబ్బతిన్న లెబనాన్‌ వంటి చిన్న దేశానికి మిత్ర దేశాలు సాయాన్ని అందించాలని ప్రధాని హసాన్ విజ్ఞప్తి చేశారు. లెబనాన్‌కు సాయాన్ని అందించేందుకు ఇప్పటికే రష్యా ముందుకొచ్చింది.