#Operation Sindoor పేరుతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రిని చూపించిన భారత్!!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్యకు శ్రీకారం చుట్టింది. మంగళవారం అర్థరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత సైనిక బలగాలు దాడులకు దిగాయి. ఈ దాడితో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు కాళరాత్రి ఎలా ఉంటుందో చూశారు. భారత రక్షణ శాఖకు చెందిన త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టాయి.
ఇందుకోసం భారత్ అమ్ములపొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసింది. ఆత్మాహుతి డ్రోన్లు... స్కాల్ప్ క్షిపణులు.. హ్యామర్ బాంబులను వాడినట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది.
వాస్తవానికి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకం ఆయుధాలు వాడారన్నది దళాలు ఎన్నడూ బహిర్గతం చేయవు. కానీ, అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా అంచనాలకు వస్తుంటారు. తాజాగా ఆపరేషన్ సిందూర్ తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
ఈ దాడులకు దళాలు ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించినట్లు తెలుస్తోంది. వీటిని లాయిటరింగ్ మ్యూనిషన్ అని వ్యవహరిస్తారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకొని.. లక్ష్యాలను గుర్తించి.. వాటిపై విరుచుకుపడతాయి. వీటిల్లో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి.
భారత్ అమ్ముల పొదిలో ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణనష్టం ప్రమాదాన్ని నివారించవచ్చు. దీంతోపాటు కదలుతున్న లక్ష్యాలను కచ్చితంగా ఛేదించేందుకు వాడతారు. అలాగే, స్కాల్ప్ క్షిపణులను స్ట్రామ్రాడో అని కూడా అంటారు. వీటిని ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది.
ఇది దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైల్. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. శత్రుదేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు వీటిని వినియోగిస్తారు. దీనిని యుద్ధ విమానాలపై నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. భారత్ తాజాగా దాడిలో ఫ్రాన్స్ తయారీ రఫేల్స్ నుంచి దీనిని పయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు.