శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (16:31 IST)

జియోకు వచ్చేయండి.. జస్ట్ 5 నిమిషాల్లో మొబైల్ పోర్టబులిటీ.. ఉచిత సేవలు: ముఖేష్ అంబానీ ప్రకటన

ఇతర నెట్‌వర్క్‌ మొబైల్ వినియోగదారులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మొబైల్ పోర్టబులిటీ సౌకర్యంతో జియో నెట్‌వర్క్‌ను ఎంచుకునేవారికి కేవలం ఐదు నిమిషాల్లో తమ టెలికాం సేవలు

ఇతర నెట్‌వర్క్‌ మొబైల్ వినియోగదారులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మొబైల్ పోర్టబులిటీ సౌకర్యంతో జియో నెట్‌వర్క్‌ను ఎంచుకునేవారికి కేవలం ఐదు నిమిషాల్లో తమ టెలికాం సేవలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొబైల్ పోర్టబులిటికీ కింద ఒక నెట్‌వర్క్ నుంచి మరో నెట్‌వర్క్‌కు మారాలంటే అన్ని టెలికాం కంపెనీలు కనీసం వారం నుంచి పది రోజుల పాటు సమయం తీసుకుంటున్నాయి. దీనికి చెక్ పెట్టేలా ముఖేష్ అంబానీ ప్రకటన చేశారు. 
 
ఇతర నెట్‌వర్క్‌ల్లా రెండు మూడు రోజుల తరబడి జియో సిమ్ యాక్టివేషన్ ఉండదని, సిమ్ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే యాక్టివేషన్ అయిపోతుందని తెలిపారు. సిమ్ తీసుకోవడం కోసం ఎలాంటి జిరాక్స్ కాపీలూ అవసరం లేదని, కేవలం ఆధార్ నంబర్ ఇస్తే చాలని ముకేష్ సూచించారు. అలాగే, జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ కింద అన్‌లిమిటెడ్‌ డేటా, వాయిస్‌, వీడియో, వైఫై, జియో యాప్స్‌ను మార్చి 31 వరకు ఉచితంగా అందిస్తామని చెప్పారు. జియో సిమ్‌లను హోమ్ డెలివరీ చేస్తున్నామన్నారు. 
 
ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ కంటే వేగంగా జియో అభివృద్ధి చెందుతోందన్నారు. అత్యంత వేగంగా సాంకేతికతను అందించే సంస్థగా జియో నిలవడం గర్వకారణమని.. ఇది తమ ఖాతాదారుల విజయమని పేర్కొన్నారు. జియోను ఆదరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని.. వీరి కోసం వచ్చే ఏడాది మార్చి 31 వరకు జియో అన్ని సేవలు పూర్తి ఉచితంగా అందించనున్నట్లు అంబానీ తెలిపారు. గడిచిన మూడు నెలలుగా రోజుకు 6 లక్షల మంది చొప్పున జియోలో చేరారు. కాగితరహిత సమాజం కోసమే జియోను తీసుకొచ్చాం. ఇతర నెట్‌వర్క్‌ కంటే జియో 25 రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉచిత కాల్స్‌ సదుపాయాన్ని కొనసాగిస్తాం.
 
ఇకపోతే వినియోగదారులు ఓ వైపు జియోపై ఎనలేని అభిమానం చూపుతున్నప్పటికీ... మిగతా ఆపరేటర్ల నుంచి తమకు సరైన సహకారం అందడం లేదని ఆయన వాపోయారు. దేశంలోని మూడు అతిపెద్ద టెల్కోలు గత మూడు నెలల్లో దాదాపు 900 కోట్ల వాయిస్ కాల్స్‌ని బ్లాక్ చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ తత్వాన్ని జీర్ణించుకోలేకనే సదరు ఆపరేటర్లు జియో అత్యున్నత టెక్నాలజీని కస్టమర్లకు చేరకుండా అడ్డుకుంటున్నాయన్నారు. 
 
అయినప్పటికీ భారత వినియోగదారుల మనసు గెలుచుకుంటూ జియో విజేతగా నిలుస్తూ వస్తోందన్నారు. ఉచిత వాయిస్ సేవలు అందుకోవడం ప్రజల హక్కు అని అంబానీ పునరుద్ఘాటించారు. గతంలో 90 శాతంగా ఉన్న కాల్ డ్రాప్స్‌ను... బుధవారం నాటికి 20 శాతానికి తగ్గేలా కృషి చేశామన్నారు. జియో వినియోగదారులకు అన్ని దేశవాళీ వాయిస్ కాల్స్‌ను ఎప్పటికీ ఉచితంగానే అందించేందుకు జియో కట్టుబడి ఉంటుందని స్పష్టంచేశారు.
 
అదేసమయంలో పెద్దనోట్లను రద్దు చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, ఇది దేశ ఆర్థిక ప్రగతికి తోడ్పడుతుందన్నారు. మోడీ నిర్ణయంతో చిన్నవ్యాపారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. చిన్న వ్యాపారుల కోసం ‘జియో మనీ’ మర్చంట్‌ అప్లికేషన్‌‌ను సిద్ధం చేశామన్నారు. ‘జియో మనీ’ మర్చంట్ అప్లికేషన్ కోటిమంది చిన్నవ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటుందని ముకేష్ తెలిపారు. నగదు రహిత లావాదేవీలు ప్రజలకు ఉపయోగకరమన్నారు.