1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Congress Flips MLC Polls Script In Nagpur, Jabs PM Modi, Devendra Fadnavis Over Posts

మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ కోటలో కాంగ్రెస్ జెండా రెపరెపలు

Congress
మహారాష్ట్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కోటలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. దీంతో బీజేపీ నేతల్లో రాజకీయ చర్చ మొదలైంది. ఫలితాలు పూర్తిగా వెలువడకముందే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసిన బీజేపీ నేతలకు ఈ గెలుపు సమాధానంగా మారింది. 
 
ప్రధాని నరేంద్ర మోడీ పోస్టును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేతలు ఎదురుదాడికి దిగారు. రాష్ట్రంలో ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ మూడు స్థానాలను గెలుచుకుంది. అధికార మహాయుతి కూటమి రెండు స్థానాలకే పరిమితమైంది.
 
నాగ్‌పూర్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ వంజారి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సుధాకర్ కోహ్లిని 3,271 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారు. ఓట్ల లెక్కింపు 40 గంటలకు పైగా సాగిన తర్వాత గురువారం ఫలితం వెలువడింది. 
 
బీజేపీకి సంప్రదాయంగా బలమైన స్థానంగా ఉన్న నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ గెలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫడ్నవీస్‌తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రచారం చేసినా బీజేపీకి ఓటమి తప్పలేదు.
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా దక్కలేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంగా స్పందించారు. నాలుగు రాష్ట్రాల్లో 28 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిందో ఊహించాలంటూ ప్రశ్నించారు. అయితే నాగ్‌పూర్ ఫలితం కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరటనిచ్చింది. మోడీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించేందుకు కాంగ్రెస్ పార్టీకి సరైన అవకాశం లభించింది. 
 
ఫలితాలు పూర్తిగా రాకముందే కాంగ్రెస్ సున్నా సీట్లకే పరిమితమైందంటూ ఫడ్నవీస్ చేసిన పోస్టును ఆయన తొలగించారని మహారాష్ట్ర కాంగ్రెస్ విమర్శించింది. ఆయన పోస్టు స్క్రీన్ షాక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. తొందరపడి చేసిన వ్యాఖ్యలు చివరకు ఇబ్బందికరంగా మారాయని ఎద్దేవా చేసింది. 2029లో మహారాష్ట్ర ప్రజలు మరింత గట్టి రాజకీయ షాక్ ఇస్తారని హెచ్చరించింది.
 
నాగ్‌పూర్‌లో ఫడ్నవీస్ స్వయంగా ప్రచారం చేసినా బీజేపీ ఓడిపోవడాన్ని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ప్రస్తావించారు. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించడం వల్లే ఈ ఫలితం వచ్చిందంటూ గంగా వ్యాఖ్యానించారు. అయితే ఈవీఎంలపై ప్రతిపక్షాలు గతంలో చేసిన ఆరోపణలను బీజేపీ, ఎన్నికల సంఘం ఖండించాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అర్నబ్ ఎఫెక్ట్- నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్