మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (13:41 IST)

మేడం మమతాజీ.. నిప్పుతో ఆటలొద్దు : గవర్నర్ ధన్కర్ హెచ్చరిక

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ గట్టివార్నింగ్ ఇచ్చారు. నిప్పుతో చెలగాటమాటరాదంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. ఇటీవల డైమండ్ హార్బర్ పర్యటన కోసం బెంగాల్ వెళ్లిన బీజేపీ చీఫ్ జేపీ నడ్డాపై అధికార టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ రాళ్ళ దాటిలో నడ్డా ప్రయాణిస్తున్న కారు అద్దాలతో పాటు.. కారు కూడా దెబ్బతింది. ఈ దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ విచారణకు ఆదేశించారు. 
 
ఈదాడిపై ఇపుడు గవర్నర్ ధన్కర్ స్పందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యానికే పెద్ద మచ్చ అని అన్నారు. నిప్పుతో చెలగాటమాడరాదని తీవ్ర స్వరంతో మమతా బెనర్జీని ఆయన హెచ్చరించారు. 
 
ముఖ్యమంత్రి మమత ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అనుసరించాలని, రాజ్యాంగ పంథా నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె పక్కకు వెళ్లరాదని సూచించారు. చాలా రోజులుగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో దిగజారిన ప్రజాస్వామ్య విలువలపై తాను కేంద్రానికి నివేదిక కూడా పంపించినట్టు తెలిపారు.
 
ముఖ్యంగా, జేపీ నడ్డాపై దాడి తర్వాత సీఎం హోదాలో ఉన్న మమతా బెనర్జీ స్పందిస్తూ, బీజేపీ నేతలు బయటివారంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను గవర్నర్ ధన్కర్ తప్పుబట్టారు. 'బయటి వ్యక్తులంటే అర్థమేమి? రాష్ట్రంలో ఉన్న వారు ఎవరు బయట వ్యక్తులు. భారతీయ ప్రజలు కూడా బయటి వారేనా? ముఖ్యమంత్రి ఇలాంటి ప్రకటనలు చేయడం ఏమాత్రం తగదు. నిప్పుతో చెలగాటమాడరాదు. ముఖ్యమంత్రి రాజ్యాంగం ప్రకారం పాలించాలి' అని వ్యాఖ్యానించారు. 
 
ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలాంటి మాట్లాడటమేంటని గవర్నర్ సూటిగా ప్రశ్నించారు. బెంగాల్ సంస్కృతి, రాజ్యాంగం ప్రకారం ఆమె వ్యాఖ్యలు ఏమాత్రం సరైనవి కావని ఆయన పేర్కొన్నారు. 'మేడమ్... దయచేసి హుందాతనం పాటించండి. దయచేసి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి' అని సీఎం మమతకి గవర్నర్ ధన్కర్ సూచించారు.