1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 29 ఏప్రియల్ 2026 (13:32 IST)

ఆరోగ్యకరమైన పనితీరుకు ఎర్గోనామిక్స్ కీలకం: ప్రముఖ ఎర్గోనామిక్స్ నిపుణుడు మను నెల్లుట్లచే నాట్స్ వెబినార్

Ergonomics
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, ముఖ్యంగా ఐటీ, ఇతర కార్యాలయాల్లో గంటల తరబడి కూర్చుని పనిచేసే వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య శారీరక నొప్పులు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఎర్గోనామిక్స్ ఎట్ హోమ్ అండ్ వర్క్ అనే అంశంపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఆన్‌లైన్ వేదికగా నిర్వహించింది. ఇల్లు, కార్యాలయాల్లో సరైన పని తీరు, కూర్చునే విధానంపై ప్రముఖ్య వైద్య నిపుణులు ఎర్గోనామిస్ట్ మను నెల్లుట్ల పలు కీలక సూచనలు చేశారు.
 
కార్యాలయంలో లేదా ఇంట్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ముందు కూర్చునేటప్పుడు వెన్నెముక, మెడ, చేతుల అమరిక ఎలా ఉండాలనే దానిపై ఈ చర్చ సాగింది. ముఖ్యంగా 90-90-90 నియమాన్ని మను సూచించారు. అంటే మోకాళ్లు, నడుము, మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండటం పాటించడం ద్వారా దీర్ఘకాలిక నొప్పుల నుంచి బయటపడవచ్చని మను నెల్లుట్ల వివరించారు.
 
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు సోఫాలు లేదా మంచాలపై కూర్చుని పనిచేయడం వల్ల వెన్నెముక సమస్యలు వస్తున్నాయని మను నెల్లుట్ల తెలిపారు. ఈ సమయాల్లో కచ్చితంగా ఎర్గోనామిక్ కుర్చీని లేదా సరైన ఎత్తు ఉన్న టేబుల్‌ను వాడాలని సూచించారు. కంప్యూటర్ స్క్రీన్ కళ్ళకు సమాంతరంగా ఉండటం వల్ల మెడపై ఒత్తిడి తగ్గుతుందని వివరించారు.
 
ప్రతి 30 నిమిషాలకు ఒకసారి సీటు నుంచి లేచి స్ట్రెచింగ్ చేయడం, కళ్లకు విశ్రాంతి ఇవ్వడం వంటి చిన్న చిన్న మార్పులు పని సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయని మను సూచించారు. లైవ్ డెమో ద్వారా సరైన పోశ్చర్  గురించి వివరించి, నెటిజన్లు అడిగిన పలు సందేహాలను మను నివృత్తి చేశారు.
 
ఈ వెబినార్ కు ముందు నాట్స్  అధ్యక్షుడు శ్రీహరి మందాడి నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ అవగాహన కార్యక్రమానికి అనుసంధానకర్తగా నాట్స్ కార్యనిర్వహక కార్యదర్శి(మీడియా) మురళీకృష్ణ మేడిచెర్ల వ్యవహారించారు. ఆన్‌లైన్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన నాట్స్ నాయకులను నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల అభినందించారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా వారి ఆరోగ్యం, సంక్షేమం కోసం ఇలాంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాలు నిర్వహించడం పట్ల నాట్స్ కార్యవర్గానికి నాట్స్ సభ్యులు, తెలుగు వారు కృతజ్ఞతలు తెలిపారు.