గుమ్మానికి నిమ్మకాయలు ఎందుకు కడతారు?
హిందూ సంప్రదాయాలు, వాటి వెనుక ఉన్న నమ్మకాల ఆధారంగా అనాదిగా కొన్ని ఆచారాలు, పద్ధతులు సాగుతూ వస్తున్నాయి. వీటిలో నర దిష్టి పోయేందుకు అనుసరించే పద్ధతి కూడా ఒకటి. సాధారణంగా దిష్టి తీయడానికి నిమ్మకాయలు, పచ్చిమిరప కాయలు, ఉప్పు, బొగ్గు వంటివి ఉపయోగిస్తారు. వీటిని గుమ్మం, వ్యాపార ప్రదేశాలు, వాహనాలకు కట్టడం వల్ల దిష్టి తగలకుండా ఉంటుందని నమ్ముతారు.
దిష్టికి మూడు నిమ్మకాయలు ఎందుకు కడతారనే ప్రశ్నకు కొన్ని సాంప్రదాయ నమ్మకాల ప్రకారం ఇలా చెప్పబడింది. హిందూ సంస్కృతిలో త్రిముూర్తులైన బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరులకు చాలా ప్రాధాన్యత ఉంది. వీరు సృష్టి, స్థితి, లయకారకులుగా పూజింపబడతారు. ఈ ముగ్గురు దేవతల శక్తులను ఆకర్షించి, ఇంటిని చెడు దృష్టి నుంచి కాపాడడానికి మూడు నిమ్మకాయలు కడతారని విశ్వాసం.
అలాగే 3 సంఖ్య త్రిశక్తికి నిదర్శనం. ఇచ్ఛా శక్తి.. అంటే సంకల్పం, క్రియా శక్తి అంటే... చర్య, మరియు జ్ఞాన శక్తుల కలయిక ద్వారా ఇంటికి లేదా వ్యాపారానికి రక్షణ లభిస్తుందని నమ్ముతారు.
ఐదు నిమ్మకాయలు ఎందుకు కడతారంటే... హిందూ సంప్రదాయంలో పంచభూతాలు అనగా భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే ఐదింటికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఐదు మూలకాల శక్తిని ఆకర్షించి చెడు శక్తులను దూరం చేయడానికి ఐదు నిమ్మకాయలు కడతారని ఒక నమ్మకం. అదేవిధంగా హిందూ సంస్కృతిలో 5 అనే సంఖ్య చాలా శుభకరమైనదిగా భావిస్తారు. పంచముఖ గణపతి, పంచ పాండవులు, పంచలోహాలు ఇలా ఐదుకి సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందువల్ల దిష్టికి సంబంధించిన ఆచారంలో ఐదు నిమ్మకాయలు కట్టడం శుభసూచకంగా భావిస్తారు.
దిష్టి తొలగేందుకు 7 నిమ్మకాయలు ఎందుకు కడతారు అనే ప్రశ్నకి... హిందూ సంస్కృతిలో ఏడు అనే సంఖ్య చాలా పవిత్రమైనది మరియు శుభకరమైనదిగా పరిగణించబడుతుంది. సప్త ఋషులు, సప్త నదులు, సప్త స్వరాలు, సప్త లోకాలు, సప్త ద్వీపాలు, సప్త పది.. అంటే ఏడు అడుగులు వంటి ఎన్నో విషయాలు ఏడు అనే సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. అందువల్ల దిష్టి తగలకుండా ఈ శుభ సంఖ్యలోని నిమ్మకాయలను కట్టడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు.
ఏడు నిమ్మకాయలు ఏడు గ్రహాల నుంచి లేదా ఏడు రకాల చెడు శక్తుల నుంచి రక్షణను కల్పిస్తాయని నమ్మకం. ఈ ఏడు నిమ్మకాయలు ఒక రక్షణ కవచంలా పనిచేసి, ఇంటికి లేదా వ్యాపార ప్రదేశానికి వచ్చే ప్రతికూల శక్తిని ఆకర్షించి, వాటిని నిర్వీర్యం చేస్తాయని నమ్ముతారు. అలాగే నిమ్మకాయలో ఉన్న పులుపు మరియు దాని శక్తి, చెడు శక్తులను దూరం చేయగలదని నమ్ముతారు. దీనిని గుమ్మం దగ్గర లేదా వాహనాలకు కట్టడం ద్వారా ఆ ప్రదేశం శుభప్రదంగా, పవిత్రంగా ఉంటుందని విశ్వసిస్తారు.
