గర్భాశయ ద్వారం బలహీనంగా ఉందని కుట్లు వేసారు, బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు, ఇప్పుడు ఏం చేయాలి?
గర్భిణీ స్త్రీకి కుట్లు వేయడం... దీన్ని ఆంగ్లంలో Cervical Circlage అంటారు. ఇలా చేసాక బెడ్ రెస్ట్ అని డాక్టర్లు చెప్పారు అంటే, గర్భాశయ ద్వారం బలహీనంగా ఉందని అర్థం. ఇలాంటి పరిస్థితిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా చేసే ఎలాంటి వ్యాయామాలు... అంటే వాకింగ్, యోగా, స్ట్రెచింగ్స్ అస్సలు చేయకూడదు.
అయితే, బెడ్ రెస్ట్ అంటే రోజంతా కదలకుండా ఒకే చోట పడుకుని ఉండటం వల్ల కాళ్ళల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. అందుకని బెడ్ రెస్ట్‌లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము.
డాక్టర్ అనుమతితో మాత్రమే చేయదగ్గవి... మంచం మీద పడుకుని లేదా కూర్చుని చేసుకునే చాలా తేలికపాటి కదలికలు మాత్రమే చేయాలి. ఇవి రక్తప్రసరణ సరిగ్గా జరగడానికి సహాయపడతాయి. మంచం మీద పడుకుని పాదాలను గుండ్రంగా తిప్పడం. కాలి వేళ్లను ముందుకు, వెనక్కు అనడం.
చేతులను పైకి, కిందకి అనడం లేదా పిడికిలి బిగించి వదలడం.
అస్సలు చేయకూడనివి ఏమిటంటే.. నడక (Walking), ఇల్లంతా తిరగడం లేదా బయట వాకింగ్‌కి వెళ్లడం అస్సలు వద్దు.
బరువులు ఎత్తడం: చిన్న చిన్న వస్తువులైనా సరే, బరువైనవి అస్సలు ఎత్తకూడదు.
వంగడం లేదా కూర్చోవడం: కింద కూర్చోవడం, వంగి వస్తువులు అందుకోవడం చేయకూడదు.
మెట్లు ఎక్కడం: మెట్లు ఎక్కడం, దిగడం పూర్తిగా నివారించాలి.
గమనిక: బెడ్ రెస్ట్ అనేది మీ ప్రెగ్నెన్సీ కండిషన్‌ను బట్టి "కంప్లీట్ బెడ్ రెస్ట్" లేక "మాడిఫైడ్ బెడ్ రెస్ట్" - అంటే వాష్ రూమ్‌కి వెళ్లడానికి మాత్రమే లేవడం అనేది గైనకాలజిస్ట్ స్పష్టంగా చెప్తారు.
కాబట్టి, చిన్న కదలికలు లేదా వ్యాయామాలు చేసే ముందు కూడా ఖచ్చితంగా డాక్టర్‌ను అడిగి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఈ సమయంలో ఎప్పుడైనా కడుపునొప్పి వస్తున్నట్లు అనిపించినా, బ్లీడింగ్ లేదా వైట్ డిశ్చార్జ్ ఎక్కువైనా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
