జనవరి 1: తిరుమలలో వీఐపీ దర్శనాలకు సిఫార్సులు కట్.. భక్తులకు ప్యాకెట్ సైజ్ శ్రీవారి ఫోటో!
తిరుమలలో జనవరి ఒకటో తేదీన వీఐపీ దర్శనాలకు సిఫారసు లేఖలు అనుమతించమని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. నూతన సంవత్సరం జనవరి 1న శ్రీవారి దర్శన టిక్కెట్లపై సమీక్ష జరిపిన అనంతరం టీటీడీ ఈవో మాట్లాడుతూ.. కొత్త ఏడాది మొదటి రోజున పరిమిత సంఖ్యలోనే ప్రొటోకాల్ వీఐపీ టిక్కెట్లు జారీ చేస్తామని, వీఐపీ దర్శనాలకు సిఫారసు లేఖలు అనుమతించమని చెప్పారు.
నడకదారి భక్తులకు మంగళవారం (డిసెంబర్ 29) నుంచి జనవరి 1వ తేదీ అర్థరాత్రి వరకు దివ్యదర్శనం టోకెన్లు, కార్డుల జారీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఫోటో మెట్రిక్ రీ ఎంట్రీ కార్డుల జారీని నిలిపివేయనున్నట్లు సాంబశివరావు తెలిపారు.
ఈ నెల 31 నుంచి జనవరి 3వ తేదీ వరకు అన్ని ప్రత్యేక దర్శనాలు నిలిపివేతతో పాటు గదుల ముందస్తు బుకింగ్‌ను కూడా రద్దు చేసినట్లు ఈవో వెల్లడించారు. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే జనవరి 1న నిబంధనలను కఠినతరం చేస్తామని, ఈ నెల 31 నుంచి జనవరి 3వ తేదీ వరకు తిరుమలలో అన్ని ప్రత్యేక దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో చెప్పారు.
ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, టెంపుల్, ఇంజనీరింగ్, కళ్యాణకట్ట, పబ్లిసిటీ విభాగాలకు చెందిన అధికారులు జనవరి 1వ తేదీన అప్రమత్తంగా వ్యవహరించాలని.. అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగనీయకుండా చర్యలు చేపట్టాలని సాంబశివరావు మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఏర్పాటైన సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జనవరి 1న భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, వేలాది మంది భక్తులు స్వామివారి దర్శించుకుంటారని.. ఆ రోజున సర్వదర్శనానికి చర్యలు చేపట్టాలని, సీనియర్ అధికారులందరూ కొండమీదే అందుబాటులో ఉండాలని ఈవో ఆదేశించారు. ఇంకా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని.. హెల్త్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ప్యాకెట్ సైజ్ శ్రీవారి ఫోటోలను పంపిణీ చేయాలని టీటీడీ పీఆర్వో టీ రవికి ఆదేశించారు. న్యూ-ఇయర్ డైరీలను, క్యాలెండర్లను శ్రీవారి ఆలయ షాపుల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు.
