తిరుమల కొండపై ఆ మార్గంలో వెళ్లే భక్తులపై కేసు పెట్టి జైల్లో పెడతాం.. టిటిడి చైర్మన్
దళారీలను ఆశ్రయించి తిరుమల శ్రీవారి సేవా టికెట్లను అధిక రేట్లకు కొనే భక్తులు విజిలెన్స్ అధికారులకు పట్టుబడితే ఇద్దరిపైనా కేసులు పెడతామని టిటిడి చైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి. ఇప్పటివరకూ ఎప్పుడూ భక్తులపైన కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవనీ, ఐతే దళారీలను పూర్తిగా కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
దళారీలపై ఎలాంటి కేసు పెడతారో అదే కేసును భక్తులపై పెట్టి జైలుకు పంపిస్తామని, దీనిపై త్వరలో జరిగే టిటిడి పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఐతే పాలకమండలిలో టిటిడి చైర్మన్ నిర్ణయానికి సభ్యులు ఏకీభవిస్తారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భక్తులపై కేసులు పెడితే హిందూ ధార్మిక సంఘాలు ఆందోళనకు దిగే అవకాశం ఉందని కొందరు సభ్యులు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.
