1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. telangana braces for summer, heatwave likely from March 2-7

తెలంగాణాలో ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం.. పగలు ఎండలు - రాత్రి వర్షం

telangana state
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పగలు విపరీతమైన ఎండలు కాస్తుంటే రాత్రిపూట మాత్రం అకాల వర్షాలు దంచేస్తున్నాయి. పైగా, ఫిబ్రవరి నెల ముగియకముందే పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ప్రజలు మరింతగా ఆందోళన చెందుతున్నారు. 
 
ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని 22 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 36 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు చేరవచ్చని అంచనా వేసింది. రాత్రిపూట కూడా చలి ప్రభావం తగ్గి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
 
మరోవైపు, అల్పపీడన ప్రభావంతో కురిసిన గాలివాన పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, కొత్తగూడ మండలాల్లో ఈదురు గాలులకు మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చేతికొచ్చిన పంట నీటిపాలవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
యాదగిరిగుట్టలో కురిసిన తేలికపాటి వర్షం లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవ ఏర్పాట్లకు స్వల్ప ఆటంకం కలిగించింది. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో అత్యధికంగా 1.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని, అయితే ఆకాశం అక్కడక్కడ మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉందాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 
తర్వాతి కథనం
ఇన్‌స్టాలో సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రధాని మోడీ... ఏంటది?