గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2017 (08:37 IST)

తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో తెలుగోడి విజయం... బంపర్ మెజార్టీతో....

తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో తెలుగోడు విజయం సాధించాడు. ఆ తెలుగు వ్యక్తి ఎవరో కాదు... హీరో విశాల్. తమిళ హీరోగా రాణిస్తున్న విశాల్... యేడాదిన్నర క్రితం జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపి

తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో తెలుగోడు విజయం సాధించాడు. ఆ తెలుగు వ్యక్తి ఎవరో కాదు... హీరో విశాల్. తమిళ హీరోగా రాణిస్తున్న విశాల్... యేడాదిన్నర క్రితం జరిగిన నడిగర్ సంఘం ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపించాడు. ఇపుడు నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ తన పవరేంటో నిరూపించాడు. 2017-19 సంవత్సరాలకు తమిళ సినీ నిర్మాతల మండలి నూతన కార్యవర్గం ఎంపికకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా విశాల్‌ సంచలన విజయం సాధించారు. ఆయన జట్టు తరపున పోటీచేసిన ప్రకాష్‌ రాజ్‌, గౌతమ్‌ వాసుదేవ మీనన్ (ఉపాధ్యక్షులు), ఎస్‌ఆర్‌ ప్రభు (కోశాధికారి)లు కూడా విజయం సాధించారు. 
 
ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. సీనియర్‌ తమిళ నిర్మాత రాధాకృష్ణన్, తెలుగు నిర్మాత కోదండరామయ్య (కేఆర్‌), విశాల్‌ జట్లు పోటీ పడ్డాయి. అయితే, ఎన్నికల్లో అంతిమ విజయం విశాల్‌ జట్టునే వరించింది. స్థానిక అన్నానగర్‌లోని కందస్వామి నాయుడు కళాశాలలో విశ్రాంత న్యాయమూర్తి ఎస్‌.రాజేశ్వరన్ పర్యవేక్షణలో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్మాతల మండలి ఎన్నికలు జరిగాయి. 
 
నిర్మాతల మండలిలో మొత్తం 1,212 మంది సభ్యులుండగా, 1059 ఓట్లు పోలయ్యాయి. 5 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించి, రాత్రి 8.30 గంటలకు ఫలితాలు ప్రకటించారు. అధ్యక్ష పదవికి పోటీచేసిన విశాల్‌ 478 రాధాకృష్ణన్ 355, కేఆర్‌ 224 ఓట్లు సాధించారు. తొలి రౌండ్‌ నుండే విశాల్‌ ముందంజలో నిలిచి విజయం సాధించారు. 
 
నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం విశాల్‌ మాట్లాడుతూ... ‘మార్పు కావాలనుకుంటే దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మా జట్టు అంకితభావంతో పనిచేస్తుంది. మాకు పదవులు ముఖ్యంగా కాదు. రాబోయే రెండేళ్లలో నిర్మాతల మండలి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేయడమే లక్ష్యం. తమిళ సినిమాకు మళ్లీ స్వర్ణయుగం తీసుకొస్తా’ అని విజయోత్సాహంతో అని విజయోత్సాహంతో ప్రకటించారు.