గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 27 మే 2017 (12:21 IST)

బాహుబలి 2 గొప్పదే కాదనను.. కానీ....

మొత్తానికి బాలీవుడ్‌ సూపర్ స్టార్‌‌లలో అహం అనే మంచు కాస్త కరుగుతున్నట్లు కనిపిస్తోంది. భారతీయ చలన చిత్ర రంగంలో సంచలన వసూళ్లను సాధించి, తెలుగు సినీ ఖ్యాతిని దేశ సరిహద్దులు దాటించిన చిత్రం ‘బాహుబలి-ద కన

మొత్తానికి బాలీవుడ్‌ సూపర్ స్టార్‌‌లలో అహం అనే మంచు కాస్త కరుగుతున్నట్లు కనిపిస్తోంది. భారతీయ చలన చిత్ర రంగంలో సంచలన వసూళ్లను సాధించి, తెలుగు సినీ ఖ్యాతిని దేశ సరిహద్దులు దాటించిన చిత్రం ‘బాహుబలి-ద కన్‌క్లూజన్’పై ఎట్టకేలకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పందించాడు. తన తాజా చిత్రం ట్యూబ్ లైట్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మాట్లాడిన సల్మాన్ బాహుబలి అద్బుత విజయాన్ని సాదించిందంటూ ప్రశంసలు కురిపించాడు కానీ అలా దాని ఘనతను ఒప్పుకుంటూనే అదే సమయంలో బాహుబలి2పై సెటైర్లు వేసి నవ్వించాడు సల్మాన్.
 
‘‘బాహుబలి-ది బిగినింగ్’ సినిమా వచ్చినప్పుడు మేము ‘భజరంగీ భాయీజాన్‌’తో వచ్చాం. ఇప్పుడు ‘బాహుబలి-ది కన్‌క్లూజన్‌’కు ‘ట్యూబ్‌లైట్’ ద్వారా వస్తున్నాం. బాహుబలి అద్భుతమైన విజయాన్ని సాధించింది. అలాగే సల్మాన్ సీఈవోపై కూడా ఒత్తిడి ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు నేను సినిమా చూడలేదు. ఇప్పుడు చూస్తా. ప్రతి సినిమాకు ఓ గమ్యం ఉంటుంది. మరి ‘ట్యూబ్‌లైట్‌’కు ఎలాంటి గమ్యం నిర్ధేశించబడిందో చూడాలి. ఎందుకంటే బాహుబలి సినిమాను నాలుగు సంవత్సరాలపాటు తీశారు. కాని నేను సంవత్సరంలో రెండు సినిమాలు చేశాను’’ అని సల్మాన్ అన్నాడు.
 
సల్మాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ఓ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించి, మిగిలిన చిత్రాలకు కొలమానంగా మారడం మంచిదేన్నారు. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ విజయం సాధించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. మొత్తంమీద బాహుబలి-2 సాధించిన బ్రహ్మాండమైన విజయం బాలీవుడ్‌ను ఇంకా మతి పోగొడుతున్నట్లే ఉంది. ట్యూబ్ లైట్ సినిమాను ఎంత గొప్పగా మార్కెట్ చేసినా 300 కోట్లకు మించి కలెక్షన్లు రావని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. 
 
చైనాతో యుద్ధ నేపథ్యంలో తీసిన ఈ సినిమాకే ఈ అంచనా వుంటే బాహుబలి 2 సాధించిన 1600 కోట్ల రూపాయల కలెక్షన్లను ఎవరు అధిగమిస్తారు? దేశంలోనే 1300 కోట్ల రూపాయలు వసూలు చేసిన బాహుబలి2 ని ఎవరు బీట్ చేయగలరు? అందుకే బాలీవుడ్‌లో ఎవరిని కదిపినా ముందుగా బాహుబలి-2 సినిమాకు ఒక నమస్కార బాణం పెట్టేసి తమ సినిమాల గురించి మాట్లాడక తప్పని పరిస్తితి ఏర్పడింది.