బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 జనవరి 2017 (13:41 IST)

సంక్రాంతి సినీ కురుక్షేత్రం :: 'కొదమసింహం' వర్సెస్ 'సమరసింహం'... ఈ పోటీ ఈనాటిది కాదు

సాధారణంగా సంక్రాంతి అంటే... తెలుగువారికి ముగ్గులు, గొబ్బెమ్మలు, కోడిపందేలు, గాలిపటాలే కాదు తెలుగు సినిమా కూడా గుర్తుకొస్తుంది. తెలుగు చిత్రరంగానికి సంబంధించినంతవరకూ సంక్రాంతి అతిపెద్ద సీజన్. కొత్త సంవ

సాధారణంగా సంక్రాంతి అంటే... తెలుగువారికి ముగ్గులు, గొబ్బెమ్మలు, కోడిపందేలు, గాలిపటాలే కాదు తెలుగు సినిమా కూడా గుర్తుకొస్తుంది. తెలుగు చిత్రరంగానికి సంబంధించినంతవరకూ సంక్రాంతి అతిపెద్ద సీజన్. కొత్త సంవత్సరంలో తొలి పరీక్షగా భావిస్తారు. కోట్లాది రూపాయలు కుమ్మరించి తీసే చిత్రాల జాతకాన్ని పరీక్షించుకొనే తొలి అవకాశం. సంక్రాంతికి విడుదలైన తమ సినిమా హిట్‌ అయితే ఇక ఆ యేడాదంతా తమ కెరీర్‌కు ఢోకా లేదని హీరోలు భావిస్తుంటారు. అందుకే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంటారు. ఆ రేసులో పాల్గొని తమ సత్తా చాటుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. సంక్రాంతికి తమ అభిమాన హీరో సినిమా లేదని తెలిస్తే అభిమానులు పడే బాధ అంతా ఇంతాకాదు. హీరోల మీదే కాకుండా దర్శకనిర్మాతల మీద కూడా ఒత్తిడి తెచ్చి సంక్రాంతికి ఎలాగైనా సినిమా విడుదల చేయించడానికి తాపత్రయపడతారు. అందుకే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంక్రాంతి సినిమాలపై ఎన్టీఆర్ కాలం నుంచి నేటి వరకు ఓ లుక్కేద్దాం.
 
గతంలోకి ఒకసారి తొంగి చూస్తే... ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ ఢీ అంటే ఢీ అని సాగుతున్న రోజులవి. వీరిద్దరు పలుమార్లు సంక్రాంతి బరిలో పోటీపడ్డాయి. ఒకసారి ఒకరిది పైచేయి కాగా, మరొకరిసారి మరొకరిది పైచేయిగా సాగింది. వారిద్దరూ నెలకొల్పిన ఈ పోటీ సంప్రదాయం నాటి నంచి నేటికీ కొనసాగుతూనే ఉంది. 1959లో ఎన్టీఆర్‌ ‘అప్పుచేసి పప్పుకూడు’తో ఏయన్నార్‌ ‘మాంగల్యబలం’ పోటీ పడింది. 1960లో ఎన్టీఆర్‌ ‘శ్రీవేంకటేశ్వర మహాత్యం’ సంక్రాంతికి సందడి చేయగా, ఏయన్నార్‌ నమ్మినబంటు, శాంతినివాసం రెండు చిత్రాలతో సంక్రాంతి బరిలో నిలిచారు.
 
1961లో ఎన్టీఆర్‌ ‘సీతారామకళ్యాణం’ సంక్రాంతి సందడిలో అడుగేస్తే, ఏయన్నార్‌ ‘వెలుగునీడలు’తో పలకరించారు. 1964లో ఏయన్నార్‌ ‘పూజాఫలం, ఆత్మబలం’ చిత్రాలు పొంగల్‌ బరిలో దూకగా, ఎన్టీఆర్‌ ‘గుడిగంటలు’ సైతం ఆ సీజన్‌‌లోనే విడుదలైంది. 1965లో ఎన్టీఆర్‌ ‘నాదీ ఆడజన్మే, పాండవ వనవాసం’ చిత్రాలు వారం రోజుల వ్యవధిలో సంక్రాంతి బరిలో దూకి రెండూ ఘనవిజయం సాధించాయి, వీటితో పాటు ఏయన్నార్‌ ‘సుమంగళి’ సంక్రాంతి పోరులోకి నిలిచింది. 
 
1966లో ఎన్టీఆర్‌ స్వీయదర్శకత్వంలో కృష్ణ, దుర్యోధన పాత్రలు పోషించిన 'శ్రీకృష్ణపాండవీయం' సంక్రాంతి సందడిలో ప్రముఖ స్థానం ఆక్రమించగా, అదే సందడిలో ఏయన్నార్‌ ‘జమిందార్‌’ కూడా పాలుపంచుకుంది. 1969లో ఎన్టీఆర్‌ ‘వరకట్నం’, ఏయన్నార్‌ 'అదృష్టవంతులు' తలపడగా, వారిద్దరి చిత్రాల మధ్యన చిన్నచిత్రంగా కృష్ణ, శోభన్‌ నటించిన ‘మంచి మిత్రులు’ విడుదలైంది.
 
1970లో ఏయన్నార్‌ ‘అక్కాచెల్లెళ్లు’తో యన్టీఆర్‌ 'తల్లా- పెళ్లామా' ఢీ కొంది. 1971లో ఎన్టీఆర్‌ ‘శ్రీకృష్ణవిజయము’తో ఏయన్నార్‌ ‘దసరాబుల్లోడు’ పోటీ పడి భలే సందడి చేశారు. 1973లో ఎన్టీఆర్‌ ‘డబ్బుకు లోకం దాసోహం’, ఏయన్నార్‌ ‘భార్యాబిడ్డలు’, కృష్ణ ‘మంచివాళ్లకు మంచివాడు’ పొంగల్‌ హంగామాలో పాలుపంచుకున్నాయి. 1974లో ఎన్టీఆర్‌ ‘పల్లెటూరి చిన్నోడు’, ఏయన్నార్‌ 'ప్రేమలు-పెళ్లిళ్లు' సంక్రాంతికి సందడి చేశాయి. 1976లో ఎన్టీఆర్‌ ‘వేములవాడ భీమకవి’, కృష్ణ ‘పాడిపంటలు’, శోభన్‌ బాబు ‘పిచ్చిమారాజు’ సంక్రాంతికే విడుదలయ్యాయి. 
 
1977లో సాగిన పొంగల్‌ వార్‌ ఓ మినీ కురుక్షేత్ర యుద్ధాన్నే తలపించింది. ఎందుకంటే రెండు పౌరాణిక చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. అవి ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేసి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘దానవీరశూరకర్ణ’, కృష్ణ, శోభన్‌ బాబు, కృష్ణంరాజు కలసి నటించిన ‘కురుక్షేత్రం’. ఈ రెండూ భారతగాథలే కావడం విశేషం. 1978లో యన్టీఆర్‌ ‘సతీసావిత్రి, మేలుకొలుపు’ సంక్రాంతికి విడుదల కాగా, ఏయన్నార్‌ ‘చిలిపికృష్ణుడు’, శోభన్‌ బాబు ‘నాయుడుబావ’, కృష్ణ ‘ఇంద్రధనుస్సు’ వచ్చాయి. 1980లో ఎన్టీఆర్‌ ‘ఛాలెంజ్‌ రాముడు’, ఏయన్నార్‌ ‘ఏడంతస్తుల మేడ’, కృష్ణ ‘భలేకృష్ణుడు’, కృష్ణంరాజు ‘శివమెత్తిన సత్యం’ సందడి చేశాయి. 1981లో ఎన్టీఆర్‌ ‘ప్రేమసింహాసనం’, ఏయన్నార్‌ ‘శ్రీశ్రీవారి ముచ్చట్లు’, కృష్ణ ‘ఊరికి మొనగాడు’, శోభన్‌ బాబు ‘పండంటి జీవితం, జగమొండి’ పొంగల్‌ పోటీలో దూకాయి. 1982లో ఎన్టీఆర్‌ ‘అనురాగదేవత’, ఏయన్నార్‌ ‘రాగదీపం’, కృష్ణ ‘బంగారుభూమి’ సంక్రాంతి సందడిలో పాల్గొన్నాయి. 
 
ఇలా టాప్‌ స్టార్స్‌ నటించిన చిత్రాలు సంక్రాంతికి సందడి చేసే ఆనవాయితీ ఆ నాటి నుంచీ కొనసాగుతోంది. తర్వాతి రోజుల్లో శోభన్‌ బాబు, కృష్ణ కొన్నాళ్లు సంక్రాంతి బరిలో తలపడ్డారు. ఆ తర్వాత బాలకృష్ణ, చిరంజీవి ఎక్కువ సార్లు పోటీపడ్డారు. వారి మధ్య అడపాదడపా నాగార్జున, వెంకటేశ్‌ వచ్చి సందడిచేశారు. ఈ స్టార్స్‌ చిత్రాల నడుమ చిన్నసినిమాలు సైతం విజయాలు సాధించిన సందర్భాలూ లేకపోలేదు. 
 
ఇలా సంక్రాంతి బరిలో పెద్ద హీరోల చిత్రాలతో చిన్న సినిమాలు పోటీపడడం పాత సంప్రదాయమే. కొన్నిసార్లు విజయం సాధించిన చిత్రాల ద్వారా కొత్తనీరు వెలికి వచ్చేది. 1996లో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. వాటితో పాటే చిన్న సినిమాగా 'పెళ్లిసందడి' వచ్చింది. ఆరంభంలో అందరూ ఆ ముగ్గురు హీరోల చిత్రాల గురించే చర్చించుకున్నారు. తర్వాత 'పెళ్లిసందడి' మౌత్‌ టాక్‌‌తో పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఘనవిజయంతో శ్రీకాంత్‌ స్టార్‌ హీరో అయ్యాడు. గత సంవత్సరం ‘నాన్నకు ప్రేమతో, డిక్టేటర్‌, సోగ్గాడే చిన్నినాయనా’ వంటి స్టార్‌ హీరోస్‌ సినిమాలతో పాటు ‘ఎక్స్‌ ప్రెస్‌ రాజా’ కూడా వచ్చి విజయాన్ని సాధించింది. 
 
ఈ పరిస్థితుల్లో దఫా సినిమా బరిలో సంక్రాంతి మొనగాడెవరు? అని గత కొన్ని రోజులుగా సగటు తెలుగు సినీ అభిమానుల మధ్య జరుగుతున్న అతిపెద్ద చర్చ. ఈ ప్రశ్నకు సమాధానం మరో మూడు రోజుల్లో తెలిసిపోతుంది. చిరంజీవి నటించిన 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ఈ నెల 11న, ఆపై ఒక్క రోజు తేడాతో బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' 12వ తేదీన విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు సంక్రాంతికి విడుదలై పోటీపడటం ఇదే తొలిసారి కాదు. దాదాపు 30 సంవత్సరాల క్రితమే 1987లో చిరంజీవి 'దొంగమొగుడు' (జనవరి 9), బాలయ్య 'భార్గవ రాముడు' (జనవరి 14) సంక్రాంతికి పోటీ పడ్డాయి.
 
అప్పటి నుంచి వీరు నటించిన ఎన్నో చిత్రాలు పోటీ పడుతూనే ఉన్నాయి. 1988లో 'మంచిదొంగ' జనవరి 14న, 'ఇన్‌స్పెక్టర్ ప్రతాప్' జనవరి 15న విడుదల అయ్యాయి. 1997లో 'హిట్లర్' జనవరి 4న, 'పెద్దన్నయ్య' జనవరి 10న, 1999లో 'స్నేహంకోసం' జనవరి 1న, 'సమరసింహారెడ్డి' జనవరి 13న రిలీజ్ అయ్యాయి. 2000 సంవత్సరంలో 'అన్నయ్య' జనవరి 7న, జనవరి 14న 'వంశోద్ధారకుడు', 2001లో 'మృగరాజు', 'నరసింహనాయుడు' జనవరి 11న విడుదలయ్యాయి. 2004లో 'అంజి' జనవరి 15న, 'లక్ష్మీనరసింహా' జనవరి 14న వెండి తెరలను తాకాయి. ఆ తర్వాత వీరిద్దరూ నటించిన సినిమాలు సంక్రాంతికి పోటీ పడలేదు. 
 
అయితే, గత సంక్రాంతి వరకూ మాత్రం చిరంజీవి సినిమాలతో పోలిస్తే, బాలకృష్ణ నటించిన సినిమాలే ఎక్కువ విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాలి. ఈ రెండు చిత్రాలు వారిద్దరికీ ఎంతో ప్రతిష్టాత్మకం... దాంతో ఈ రెండు సినిమాల కోసమే తెలుగునేలపైని మెయిన్‌ థియేటర్స్‌ ముస్తాబవుతున్నాయి. అయినా శర్వానంద్‌ ‘శతమానం భవతి’, ఆర్‌. నారాయణమూర్తి ‘హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకట్రామయ్య’ కూడా సంక్రాంతి సందడిలో తామూ పాలు పంచుకుంటామని వస్తున్నారు. మరి ఈ సారి ఈ చిన్న చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తాయో చూడాలి.