హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు హీరో కృష్ణసాయి సాయం
Krishna Sai helps Hyderabad school students
కుల, మత, ప్రాంత బేధాలకు అతీతంగా, రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ హీరోగా నిలుస్తున్నారు టాలీవుడ్ హీరో కృష్ణసాయి. తన కృష్ణసాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజంలో అభాగ్యులకు చేయూతనిస్తున్నారు. తాజాగా, అంబర్‌పేటలోని గోషామహల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ షూస్ అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
“పేదరికం కారణంగా ఏ ఒక్కరి చదువూ ఆగిపోకూడదు. మట్టిలో మాణిక్యాలైన ప్రతిభావంతులైన విద్యార్థులకు అవకాశాలు కల్పించడం ఎంతో ముఖ్యం,” అని ఈ సందర్భంగా కృష్ణసాయి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట సీఐ కిరణ్ కుమార్, పాఠశాల హెడ్‌మాస్టర్ వేణు మాధవ్ శర్మ, హిందీ స్కూల్ అసిస్టెంట్ మహ్మద్ యాదుల్లా, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణసాయి సేవలను వారు ఈ సందర్భంగా కొనియాడారు. నిరంతర సేవా కార్యక్రమాల ద్వారా సమాజ సేవలో తన వంతు పాత్ర నిర్వహిస్తున్న కృష్ణసాయిని అభినందించారు. కృష్ణసాయి గతంలో కూడా చదువులో టాపర్‌గా నిలిచిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించినట్లు వారు గుర్తు చేశారు.
సుందరాంగుడు, జ్యువెల్ థీఫ్ వంటి చిత్రాల్లో హీరోగా నటించిన కృష్ణసాయి, తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు, అవసరమైన వారికి నిరంతర సహాయం అందిస్తూ సమాజంలో మంచి మార్పును తీసుకొస్తున్నారు. “ఈ సేవలు భవిష్యత్తులోనూ కొనసాగుతాయి,” అని కృష్ణసాయి ఉద్ఘాటించారు.