విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనని తెలుస్తోంది. ఈ చిత్రం జనవరి 9వ తేదీన సంక్రాంతికి విడుదల కావాల్సివుంది. కానీ, సెన్సార్ సర్టిఫికేట్ వివాదంలో చిక్కుకోవడంతో విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో కెనడాలోని భారతీయ చిత్రాల పంపిణీ సంస్థ యార్క్ సినిమాస్ తాజాగా చేసిన ప్రకటనతో జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనన్న ప్రచారం సాగుతోంది.
సదరు సంస్థ తాజాగా పేర్కొంటూ 'జన నాయగన్' ఏప్రిల్ 30 లోపు విడుదల కాదన్న విషయాన్ని గమనించగలరు' అని ప్రస్తావించింది. ఈ సినిమా టికెట్లు బుక్ చేసుకుని, ఇంకా రిఫండ్ పొందని వారు సంబంధిత థియేటర్ల యాజమాన్యాలను సంప్రదించొచ్చు అని పేర్కొంది.
కొత్త విడుదల తేదీ ఖరారైన తర్వాత ప్రాధాన్యతను బట్టి బుకింగ్ చేసుకునే వీలుంటుందని తెలిపింది. దీంతో, మేలో విడుదల ఉండొచ్చని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు, తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రిలీజ్ మరింత ఆలస్యం కానుందనే టాక్ వినిపిస్తోంది. యార్క్ సినిమాస్ ప్రకటనపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన లేదు.
హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. సెన్సార్ బోర్డు వద్ద సమస్య తలెత్తగా.. ఆ వివాదం తొలుత మద్రాస్ హైకోర్టుకు, తర్వాత సుప్రీంకోర్టుకూ చేరిన సంగతి తెలిసిందే. దీని విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన న్యాయస్థానం మద్రాసు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. కోర్టులో పలు వాదనల అనంతరం.. సెన్సార్ బోర్డుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను నిర్మాతలు కొన్ని రోజుల క్రితం ఉపసంహరించుకున్నారు. సినిమాని రివైజింగ్ కమిటీకి పంపించారు.