శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 మే 2017 (12:06 IST)

రజనీకాంత్‌కు భారతీరాజా షాకింగ్ ట్రీట్ ... తమిళనాడును తమిళుడే పాలించాలి!

సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కోలీవుడ్ అగ్ర దర్శకుడు భారతీరాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రజనీకాంత్ స్థానికతపై కొన్ని తమిళ సంఘాలు, రాజకీయ పార్టీలు రాద్దాంతం చేస్తున్న నేపథ్యంలో ఈ అగ్రదర్శకుడు ర

సూపర్ స్టార్ రజనీకాంత్‌పై కోలీవుడ్ అగ్ర దర్శకుడు భారతీరాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రజనీకాంత్ స్థానికతపై కొన్ని తమిళ సంఘాలు, రాజకీయ పార్టీలు రాద్దాంతం చేస్తున్న నేపథ్యంలో ఈ అగ్రదర్శకుడు రజనీ స్థానికతను ప్రశ్నించేలా కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. 
 
వాస్తవానికి తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంచానికే పరితమైన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ శూన్యత అనేది నెలకొంది. వీరిద్దరి స్థానాలను భర్తీ చేసే నేతలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఇదేసమయంలో రజనీకాంత్ ఇటీవల తన అభిమానులతో సమావేశమయ్యారు. సొంతగా రాజకీయ పార్టీని స్థాపించే నిమిత్తమే ఆయన అభిమానులతో సమావేశమయ్యారనే వార్తలు గుప్పుమన్నాయి. 
 
దీంతో రజనీని రాజకీయాల్లో రాకుండా అడ్డుకునేందుకు ఆయన తమిళుడు కాదంటూ పలు తమిళ సంఘాలు ఆందోళనకు దిగాయి. బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఈ విషయంలో అందరికంటే ముందున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ప్రముఖ తమిళ సినీ దర్శకుడు భారతీరాజా స్పందించారు. 
 
ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు తమిళనాడులో జీవించడంలో తప్పు లేదని... కానీ, రాష్ట్రానికి నాయకత్వం వహించడానికి మాత్రం వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. తమిళనాడులో పుట్టిన వారికే తమిళులను పాలించే హక్కు ఉందని స్పష్టంచేశారు. తమిళ భాషను కాపాడాలని తమిళులంతా ఐకమత్యంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. వయోభారం కారణంగా తాను రాజకీయపరంగా ఏమీ చేయలేక పోయినా తమిళ యువకులు మాత్రం అప్రమత్తంగా ఉండి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. తమిళ సినీ రంగంలో ఎంతో సీనియర్ అయిన భారతీరాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారాయి.