మన బిడ్డగా నిన్ను మళ్లీ భూమిపైకి తీసుకురావాలి.. ఐ లవ్ యూ..!
కన్నడ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణంపై ఆయన భార్య స్పందించారు. చిరంజీవి సర్జా 2018 మే 2న మేఘనా రాజ్‌ను వివాహమాడారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. కాగా చిరంజీవి సర్జా జూన్ 7న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా మేఘనా కన్నీటి వీడ్కోలు పలికారు. ఇంకా మేఘనా రాజ్ సోషల్ మీడియాలో భావోద్వేగ లేఖ షేర్ చేశారు.
"చిరు.. నీకు ఎన్నో విషయాలు చెప్పాలనుంది. కానీ ఎంత ప్రయత్నించినా దాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను. నువ్వు నాకు ఎంత ముఖ్యమనేది ప్రపంచంలో ఏదీ వర్ణించలేదు. స్నేహితుడిగా, ప్రేమికుడిగా, జీవిత భాగస్వామిగా, చంటి పిల్లాడిగా, నా ధైర్యంగా, నా భర్తగా.. అసలు వీటన్నింటి కన్నా ఎక్కువే. నువ్వు నా ప్రాణం. కానీ ఏదో అర్థం కాని బాధ నన్ను ప్రతీక్షణం చిత్రవధ చేస్తోంది.
నువ్వు లేవని గుర్తొస్తున్న ప్రతిక్షణం నా మనసు కుంగిపోతుంది. వేలాదిసార్లు చస్తున్నంత నరకంగా ఉంది. కానీ నా చుట్టూరా ఏదో మంత్రం వేసినట్లు అనిపిస్తోంది. నేను దిగులుపడ్డ ప్రతిసారి నన్ను సంరక్షించేందుకు నువ్వు నా చుట్టూనే ఉన్నావనిపిస్తోంది. నన్ను ఎంతగానో ప్రేమించావు.. ఎప్పటికీ నా చేయి వదలనంటూ మాటిచ్చావు.
కానీ ఏం చేశావు? మన ప్రేమకు గుర్తుగా నాకు పాపాయిని ఇస్తున్నందుకు నీకు చిరకాలం కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాను. మన బిడ్డగా నిన్ను మళ్లీ భూమిపైకి తీసుకువచ్చేందుకు నేను తహతహలాడుతున్నాను. నీతో కలిసి బతికేందుకు ఎదురు చూస్తున్నాను.
నీ నవ్వు చూసేందుకు నేనాగలేకున్నాను.. నీ నవ్వులతో గదంతా వెలుగులు విరజిమ్మడం కోసం ఎదురుచూస్తున్నా.. నేను నీకోసం ఎదురుచూస్తూనే ఉంటా.. అలాగే నువ్వు నాకోసం ఎదురుచూస్తూ ఉండు.. అయినా నా ఊపిరి ఆగిపోయేవరకు నువ్వు బతికే ఉంటావు. ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు. ఐ లవ్ యూ.." అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.