Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి
మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్. కార్చిచ్చు..లాంటివాడు. ఆయన్ను చాలా దగ్గరగా చూసినవాడిని కాబట్టి చెప్పగలుగుతున్నాను. నేను మూర్తీభవించిన ధర్మాగ్రహం అంటాను. ఆగ్రహం మనందరికీ వస్తుంది. కానీ సమాజం కోసం వచ్చేది ధర్మాగ్రహం. ఆయనకు మాత్రమే సరిపోయేలా 'హరి హర వీరమల్లు'ను తీర్చిదిద్దారు. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చు పవన్ కళ్యాణ్ గారు. కార్చిచ్చు మీద ఎంత వాన పడినా అది ఆగదు. ఆయనతో మొదటిసారి చేస్తున్న సినిమా కాబట్టి ఎంతో శ్రద్ధతో చేశాను.
'హరి హర వీరమల్లు లో అసుర.. సాంగ్ నేడు విడుదలైంది మూడో సాంగ్. ఇంకా మూడు పాటలున్నాయి. అవి ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తున్నాం. ఇందులో ఓ ఐటం సాంగ్ కూడా వుంది. సహజంగా సినిమాల్లో ఐటెం సాంగ్ అంటే తెలిసిందే. కానీ బాధ్యతగల వ్యక్తిగా ఇందులో అలాంటిది లేకుండా చూడమన్నారు. చారిత్రక కథ కాబట్టి వుండాలనుకుంటే సాహిత్యంలో ఎక్కడా అపశబ్దాలు దొర్లకుండా చూడమని చెప్పారు. అదీ పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అని.. ఎం.ఎం. కీరవాణి అన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీరమల్లు'. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు. నిధి అగర్వాల్ కథానాయిక. బాబీ డియోల్ ప్రతినాయకుడు. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. నేడు ఈ చిత్రం నుంచి మూడవ గీతంగా 'అసుర హననం' విడుదలైంది. ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమాన్ని చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రేక్షకుల కోసం తెలుగు, తమిళ, హిందీ వ్యాఖ్యాతలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం.
అనంతరం కీరవాణి పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, "హరి హర వీరమల్లు సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం రాధాకృష్ణ(క్రిష్)తో మొదలైంది, ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. నేను చాలామంది దర్శకులను చూశాను. కానీ, తక్కువమందిలో ఉండే అరుదైన క్వాలిటీ జ్యోతిలో ఉంది. వేగంగా నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాడు. ఎడిటింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్ అన్ని పనులు ఒక్కడే చూసుకుంటూ నిద్రాహారాలు మాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఇండస్ట్రీలో వివాద రహితుడిగా ఎ.ఎం. రత్నం గారికి పేరుంది. లిరిక్ రైటర్ గా ఆయనకు నేను పెద్ద ఫ్యాన్ ని. ఈ సినిమా రూపంలో ఎ.ఎం. రత్నం గారికి మరో భారీ విజయం సొంతం అవుతుందని విశ్వసిస్తున్నాను. అలాగే నిర్మాత దయాకర్ గారంటే నాకెంతో గౌరవం. ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంతో ఉంది. రాంబాబు లాంటి మంచి గీత రచయితను నాకు జ్యోతికృష్ణ పరిచయం చేశారు. నిధి అగర్వాల్ తన పాత్రను చక్కగా పోషించింది. పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ పవర్ స్టార్ అంటారు " అన్నారు.