1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 మే 2025 (12:19 IST)

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

renu desai
చైనా వస్తు ఉత్పత్తులకు వ్యతిరేకంగా సినీ నటి రేణూ దేశాయ్ ఓ పిలుపునిచ్చారు. మన దేశంలో అమ్ముడయ్యే చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దామని ఆమె కోరారు. ఒక వస్తువు కొనేముందు అది ఎక్కడ తయారైందో తెలుసుకోండి.. ఒకవేళ అది చైనాలో తయారైతే దాన్ని కొనకండి.. మన దేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేద్దాం. మన దేశాన్ని ఆదరిద్దాం అని రేణూ దేశాయ్ కోరారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చైనా ఉత్పత్తుల వాడకాన్ని మానెయ్యాలని ఆమె పిలుపునిస్తూ సోషల్ మీడియాలో ఆమె ఓ పోస్టు చేశారు. 
 
దేశ భద్రత, కుటుంబ శ్రేయస్సు నిజంగా మనకు ముఖ్యమని భావిస్తే చైనాలో తయారైన చిన్న వస్తువును కూడా కొనడం ఆపేయాలని ఆమె కోరారు. ఏదైనా వస్తువు కొనేముందు దాని లేబుల్‌ను ఇప్పటినుంచైనా చదవడం ప్రారంభించండి. చైనా ఉత్పత్తులను కొనడం మానేశామని అందరికీ తెలిసేలా చేయండి అని సూచించారు. తాను కూడా ఇప్పటివరకు చైనాలో తయారైన వస్తువులు కొన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో ప్రతి వస్తువుపై ఉండే లేబుల్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తెలిపారు. 
 
ఒకవేళ అది చైనాలో తయారైనట్టు తేలితే దాన్ని కొనకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే, ఇది ఒక్కరోజులో అయ్యే పనికాదన్నారు. సుధీర్ఘమైన ప్రక్రియ అని అంగీకరిస్తూనే, ఎక్కడో ఒక చోట దీనిని ప్రారంభించాలి. మన దేశానికి, మన మాతృభూమికి మనం మద్దతు ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయండి. అర్థంలేని టీవీ రియాలిటీ షోల గురించి, అనవసరమైన రూమర్ల గురించి మాట్లాడుకోవడం కంటే మన దేశ పరిస్థితి గురించి చర్చించుకోవడం మొదలుపెడదాం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కోరారు.