1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 మే 2016 (16:56 IST)

కేరళ దళిత విద్యార్థినిని పేగులాగి హత్య చేశారు.. ప్రియమణి ట్వీట్స్‌తో కొత్త వివాదం!!

కేరళలో దళిత విద్యార్థినిపై పాశవిక అత్యాచారం, హత్య ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అనేకమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. సినీ నటి ప్రియమణి దళిత విద్యార్థిని అత్యాచారంపై ట్విట్టర్లో స్పందించారు. అయితే ప్రియమణి ట్వీట్స్‌పై ప్రస్తుతం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 
కేరళలోని కొచ్చికి సమీపంలో ఉన్న పెరుంబావూర్‌కు చెందిన జిషా (29) అనే దళిత విద్యార్థిని ఏప్రిల్ 28వ తేదీన అత్యాచారంతో పాటు హత్యకు గురైంది. జిషా పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం 30 గాయాలు ఆమె శరీరంలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆమె కడుపులోని పేగును బయటికి లాగి ఆమెను పాశవికంగా హత్య చేశారని పోస్టుమార్టం రిపోర్ట్ తేలింది.  
 
ఈ ఘటనపై కేరళకు చెందిన సెలెబ్రిటీలు, ప్రజలు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన తరహాలో కేరళలో దళిత విద్యార్థినిపై దారుణం చోటుచేసుకుందని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై సినీ నటి ప్రియమణి ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇలాంటి దురాగతాలకు బ్రేక్ వేయాలని డిమాండ్ చేశారు. బాధిత యువతికి సరైన న్యాయం జరగాలని.. నిందితులకు శిక్షపడాలన్నారు. అలాగే భారత్‌లో మహిళలకు భద్రత లేదని తెలిపారు. 
 
నిర్భయ తరహాలో కేరళలో ఓ దళిత విద్యార్థిని పాశవికంగా అత్యాచారం, హత్యకు గురికావడంపై ప్రియమణి తీవ్రంగా ఖండించింది. భారత్ మహిళలకు భద్రత ఇచ్చే దేశంగా తెలియట్లేదని, ఆ మహిళకు న్యాయం కావాలని ప్రియమణి డిమాండ్ చేసింది. ఇలాంటి సంఘటనలు ఇదేవిధంగా కొనసాగితే భారత్‌లో ఉన్న మహిళలు.. భద్రత కోసం వేరే దేశాలకు వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నానని ప్రియమణి ట్వీట్ చేసింది. దీంతో ప్రియమణికి సోషల్ మీడియాలో నెటిజన్ల అభ్యంతరకర ట్వీట్స్ వెల్లువెత్తుతున్నాయి. 
 
ప్రియమణి భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తున్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నెటిజన్ల ట్వీట్స్‌కు ప్రియమణి బదులిచ్చింది. తన ట్వీట్స్‌ను ముందు బాగా చదవాలని, దేశానికి వ్యతిరేకంగా తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని.. భారత్‌లోని మహిళలపై జరిగే అఘాయిత్యాలపై మాత్రమే స్పందించానని.. క్లారిటీ ఇచ్చింది.