గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమ కథతో శరపంజరం
గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఎం జరిగింది. ఆఊరి దొర మరియు గ్రామ ప్రజలు వీరిపై ఎలాంటి వ్యతిరేకత కనపరచారు అనే పల్లెటూరు నేపధ్యంలో సాగే కథాంశంతో వస్తున్న జీరో బడ్జెట్ చిత్రమే శరపంజరం. దోస్తాన్ ఫిలింస్, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై టి. గణపతిరెడ్డి సహకారంతో, మామిడి హరికృష్ణ ఆశీస్సులతో నవీన్‌కుమార్ గట్టు, లయ జంటగా, నవీన్‌కుమార్ గట్టు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ చిత్రం ట్రైలర్ విడుదల, ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇది మట్టి మనుషుల కథ. మన సమాజంలో అత్యంత దుర్మార్గమైన జోగిని వ్యవస్థ, చావులకు గంగిరెద్దులను ఆడిరచే సంచార జాతుల వెతలు నేపథ్యంగా తీసిన ఇలాంటి చిత్రాలు కోట్లాది మందికి చేరతాయి. తద్వారా సమాజంలో మార్పు వస్తుంది. మట్టి మనుషుల జీవితాలను తీసుకుని, తొలి సినిమానే సామాజిక చైతన్యం కోసం పాటుపడే చిత్రాన్ని ఎంచుకున్న దర్శకుడు నవీన్ గట్టుకు నా అభినందనలు. అలాగే గణపతిరెడ్డి గారికి, ఈ సినిమా నిర్మాణంలో సహకరించిన అందరికీ నా శుభాకాంక్షలు అన్నారు.
టి. గణపతిరెడ్డి మాట్లాడుతూ, సంగీత దర్శకుడు మల్లిక్ ద్వారా ఈ సినిమా గురించి నాకు తెలిసింది. ఎన్నో కష్టాలకు ఓర్చి వీరంతా కష్టపడుతుంటే నాకు చాలా సంతోషం వేసింది. నేను గతంలో నిర్మించిన చిత్రాల షూటింగ్‌ల సమయంలో కేరవాన్‌లు, ఇతరిత్రా అనేక హంగామాలు చూశాను. కానీ ఈ సినిమా లొకేషన్‌కు వెళితే ఎవరి టిఫిన్‌లు, భోజనాలు వారే తెచ్చుకుని తింటూ పనిచేయడం చూసినప్పుడు అనిపించింది. కడుపునిండిన వాడికి అన్నం పెడితే తిని పడుకుంటాడు.. అదే ఆకలితో ఉన్న వాడికి పెడితే మనల్ని జీవితాంతం గుర్తుంచుకుంటాడు అని. తప్పకుండా ఇలాంటి చిత్రాలు మరిన్ని వస్తేనే అనేక వర్గాలు, జాతుల ప్రజల నిజజీవితాలు ప్రపంచానికి తెలుస్తాయి. అందరూ ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.
హీరో, దర్శకుడు నవీన్ గట్టు మాట్లాడుతూ, ఈ సినిమా కోసం నేనే చాలా కష్టపడ్డాను. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ సినిమానే ప్రేక్షకులకు చేర్చడమే లక్ష్యంగా బతికాను. ఈ విషయంలో నాకు ఎంతోమంది స్నేహితులు సహకరించారు. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. గణపతిరెడ్డి గారి రూపంలో ఆదేవుడే మాకు సహకరించినట్లు అనిపించింది. జీరో బడ్జెట్‌తో, కేవలం స్నేహితుల సహకారంతో మొదలు పెట్టిన ఈ యజ్ఞం ఇప్పుడు విడుదలకు రావడం మేం సక్సెస్ అయ్యామనే అనిపిస్తోంది. మల్లిక్ గారు సినిమాను తన భుజాలపై వేసుకుని మాతో కలిసి నడిచారు. నాకు సహకరించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరికీ పాదాభివందనాలు. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను అన్నారు.
సంగీత దర్శకుడు మల్లిక్ ఎం.వి.వి. మాట్లాడుతూ, నిజంగా ఇది మట్టి మనుషుల కథే. సమాజంలో ఉన్న కొన్ని రుగ్మతలను రూపుమాపాలనే చక్కని ఆశయంతో మొదలు పెట్టిన ఈ చిత్రం ఈనెల 19న విడుదల అవుతోంది. యూనిట్ మొత్తం తమ స్వంత చిత్రంగా భావించి పనిచేశారు. జీరో బడ్జెట్‌తో సినిమా తీయడం అంటే మాటలు కాదు. దానికి దేవుని సహకారం కావాలి. గణపతిరెడ్డి రూపంలో ఆ దేవుడే మాకు సహకరించారు అనిపిస్తోంది. నవీన్ దర్శకత్వం ప్రతిభ ఇప్పుడు ట్రైలర్‌లో చూశాము. ఆయన కష్టం వృధాకాదు. తప్పకుండా సినిమా ఘన విజయం సాధిస్తుంది అన్నారు.