గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2015 (14:47 IST)

'ఆంధ్రాపోరి' సడెన్‌గా ప్రేమలో పడితే సరిపోతుంది... రివ్యూ రిపోర్ట్

ఆంధ్రాపోరీ నటీనటులు: ఆకాష్‌ పూరి, ఉల్కాసింగ్‌ తదితరులు; కెమెరా: ప్రవీణ్‌ వనమాలి, సంగీతం: జోస్యభట్ల, నిర్మాత: రమేష్‌ ప్రసాద్‌, దర్శకత్వం: రాజ్‌ మాదిరాజ్‌.
 
పాయింట్‌: టీనేజ్‌లో ప్రేమ ఎలా వుంటుంది.
ఈమధ్య టీనేజ్‌ ప్రేమలు తెలుగు సినిమాల్లో తక్కువగా వస్తున్నాయి. గతంలో ప్రేమసాగరం... వంటి చిత్రం అప్పటి యూత్‌ను ఒక్క ఊపు వూపింది. టీనేజ్‌లో స్వచ్ఛమైన ప్రేమ ఎలా వుంటుందో చూపించింది. తెలుగు సినీరంగంలో ప్రసాద్‌ ల్యాబ్స్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌ గతంలో 'రుషి' అనే చిత్రాన్ని తీశారు. సీరియస్‌ మూవీ. అయితే ఈసారి హిట్‌ కోసం మరాఠీ 'టైంపాస్‌' చిత్రం రీమేక్‌ చేశారు. ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
అదో పల్లెటూరు. థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ వుంటుంది. తండ్రి లేని ఆకాష్‌ పూరిని తల్లి పెంచి పదవ తరగతి వరకు చదివిస్తుంది. ఈసారైనా పాసైతే పవర్‌ స్టేషన్‌లో చిన్నపాటి ఉద్యోగం వస్తే... ఇంటిని సాకుతాడని ఆమె ఆశపడుతుంది. కానీ ఆకాష్‌ బలాదూర్‌. చిరంజీవి అభిమానంతో.. ఊళ్లో వున్న టూరింగ్‌ టాకీస్‌లో బేనర్లు, పోస్టర్లు కడుతుంటాడు. ఈసారి కూడా తప్పితే తల్లి మందలిస్తుంది. ఇంటి నుంచి గెంటేస్తుంది. అలా వెళ్ళి టూరింగ్‌ టాకీస్‌లో పడుకోవడానికి ప్రయత్నిస్తాడు. విషయం తెలిసిన ఓనర్‌ అతడికి ఊడ్చే పని నుంచి రీళ్లు చుట్టే పని అప్పగిస్తాడు. 
 
అలాంటి టైంలో పవర్‌ స్టేషన్‌లో ఆఫీసర్‌ కూతురు పవిత్ర(ఉల్కాసింగ్‌)ను మొదటి చూపులో ప్రేమించేస్తాడు. అలా ఇద్దరి ప్రయాణం కొన్ని మలుపుల మధ్య చివరిస్థాయి వరకు చేరుతుంది. చివరికి తల్లిదండ్రులకు తెలిస్తే ససేమిరా అంటారు. ముందు చదువు పూర్తిచేయి తర్వాత చూస్తానని ఆకాష్‌కు చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది కథ.
పెర్‌ఫార్మెన్స్‌ 
నటనాపరంగా ఆకాష్‌ కొత్తవాడు... ఉల్కాసింగ్‌.. ఝాన్సీకి రాణి.. అనే హిందీ సీరియల్‌లో చేసిన అనుభముంది. ఇద్దరికీ నటనలో శిక్షణ ఇచ్చి దర్శకుడు చేయించాడు. ఉల్కాసింగ్‌ ఈజీగా చేసేసింది. ఆకాష్‌ ఇంకా నేర్చుకోవాల్సి వుంది. టీనేజ్‌లో చేసే పనులు కాబట్టి కొట్టుకుపోతాయి. ఇక మిగిలిన పాత్రలన్నీ కొత్తవారే... వారి పాత్రలకు వారు న్యాయం చేశారు. టూరింగ్‌ టాకీస్‌ ఓనర్‌గా ఉత్తేజ్‌ చేశాడు. 
 
టెక్నికల్‌గా.... 
ప్రవీణ్ కెమెరా పనితనం ఫర్వాలేదు. జోస్యభట్ల సంగీతం యూత్‌ను ఆకట్టుకుంటుంది. సాహిత్యపరంగా సుద్దాల, రామజోగోయ్య శాస్త్రితో పాటు మరో నలుగురు రాశారు. 'దేత్తడి..' అనే పాట ఊపు తెప్పిస్తుంది. 
 
విశ్లేషణ :
రీమేక్‌ చిత్రాలు చేయాలంటే.. కాస్త సాహసమే.... అక్కడ విజయవంతమైన సినిమాను దృష్టిలో పెట్టుకుని యదాతథంగా తీయడానికి లేదు. ఇక్కడ నేటివిటీ మారుతుంది. దర్శకుడు అదే చేశాడు. పూర్తిగా మార్చేశాడు. థ్రెడ్‌ అలాగే వుంటుంది. అయితే దర్శకుడు తీసే విధానంలో ఇంకా క్లారిటీ వుండాలి. కొన్ని సీన్స్‌ సీరియల్స్‌గా పాత్రలు వచ్చిపోతుంటాయి. ఫీలింగ్‌ ఎక్కడా కన్పించదు. మొదటి భాగంగా బోర్‌గా అనిపిస్తుంది. దానికి కారణం.. హీరోహీరోయిన్ల చుట్టూనే కథ తిరుగుతుంది. కథలో పెద్దగా ట్విస్ట్‌ వుండదు. ఇట్టే తెలిసిపోతుంది.
 
తల్లి.. కొడుకును ఇంట్లో నుంచి గెంటేస్తే.. స్నేహితులు గేలిచేస్తారు. ఎందుకంటే వీడి సంగతి తెలుసు కాబట్టి. మళ్లీ 10 తప్పాడు అంటారు. కానీ షడెన్‌గా వారు ప్రేమలో పడితే సరిపోతుందని సలహా ఇస్తాడు. ఇదే దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్. ఇంట్లోంచి వెళ్ళిపోయినోడు ఎక్కడ వుండాలి... ఎలా వుండాలని చెప్పకుండా షడెన్‌ ట్విస్ట్‌ బలవంతంగా అతికించినట్లుగా, డైవర్ట్‌ చేసినట్లుగా వుంది. ఇలాంటిదే మరొకటి ఉల్కాసింగ్‌ సంగీతం నేర్చుకుంటుంది. టీచర్‌ పాఠం చెబుతుంటే సరిగమలు సరిగ్గా పలుకడం లేదని, ఏమైంది... ఎవరితోనైనా ప్రేమలో పడ్డావా? అంటూ అడిగేస్తుంది. అతడిని ఊహించుకుని పాడమని చెబుతుంది. ఇదో ట్విస్ట్‌... అక్కడ హీరోకు స్నేహితులు, ఇక్కడ హీరోయిన్‌కు టీచర్‌ క్లాస్‌ పీకుతారు. టీనేజ్‌ వయస్సులో తెలీనితనం.. ఏం చేస్తున్నామో తెలీని గందరగోళంలో పడతారు. అది ఉల్కాసింగ్‌లో కన్పిస్తుంది. హీరోలో అది కన్పించదు. ఎందుకంటే రఫ్‌గా వుంటాడు కాబట్టి.
 
పేదవాడు ఉన్నవాడి కూతుర్ని ప్రేమించడం మామూలే. ఇక్కడా అణాపైసాకు పనికిరాని వాడు, తెలుగు పండితుడు.. పవర్‌ స్టేషన్‌లో ఆఫీసర్‌ కూతురును ప్రేమిస్తాడు. పల్లెటూరు కాబట్టి అక్కడ వ్యవహారాలు కథనంలో నవ్వు తెప్పిస్తాయి. మొత్తంగా టీనేజ్‌ ప్రేమ సరైందికాదు. పెద్దలు చెప్పినట్లు వినండి.... చదువుకోండి... ఆ తర్వాతే ప్రేమ, పెండ్లి అని ముగింపు ఇస్తాడు దర్శకుడు. ఈ విషయం చాలా సినిమాల్లో చెప్పిందే. అయితే... ఏదో కొత్తప్రయోగం చేయాలని చూశాడు. అయితే ఇటువంటి కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో కమర్షియల్‌గా గెలవడం కష్టమే. ఏదో సాదాసీదా చిత్రమే. కానీ, పూరీ జగన్నాథ్‌ కుమారుడు ఆకాష్‌ పూరీకి.. ఇది ట్రైయల్‌ సినిమాగా వుపయోగపడుతుంది.
 
 
రేటింగ్‌: 2/5