శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జులై 2024 (09:45 IST)

దుప్పటి ఇచ్చేందుకు నిరాకరించిన ఫ్లైట్ అటెండెంట్ : నిరసనకు దిగిన ప్రయాణికులు.. విమానం రద్దు!!

flight
దుప్పటి కారణంగా ఓ విమానం రద్దు అయింది. ఈ ఆసక్తికర ఘటన మొరాకాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విమానంలో చలి ఎక్కువగా ఉండటంతో దుప్పటి ఇవ్వాలని ఓ ప్రయాణికుడు కోరాడు. అందుకు ఫ్లైట్ అటెండెంట్ నిరాకరించింది. విమాన ప్రయాణికుడికి మద్దకు ఇతర ప్రయాణికులు కూడా నిలిచారు. పైగా ఫ్లైట్ అటెండెంట్ చర్యకు నిరసనగా వారంతా విమానం దిగిపోయారు. దీంతో ఆ విమాన సర్వీసును రద్దు అయింది. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే, మాంట్రియాలు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎయిర్ కెనడా విమానంలో ఓ ప్యాసెంజర్.. ఫ్లైట్ అటెండెంట్‌ను దుప్పటి ఇవ్వమని అడిగారు. ఏసీ కారణంగా చలి ఎక్కువగా ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఫ్లైట్ అటెండెంట్‌కు ప్యాసెంజర్‌కు మధ్య ఊహించని విధంగా వాగ్వాదం తలెత్తింది.
 
ప్యాసెంజరైపై తీవ్ర ఆగ్రహం ప్రదర్శించిన ఫ్లైట్ అటెండెంట్ మర్యాదగా నడుచుకోవాలని హెచ్చరించింది. ఆ తర్వాత విమానం దిగిపోవాలని కోరింది. వెనక్కు తగ్గని ప్యాసెంజర్.. కెప్టెన్‌ను పిలుచుకురావాలని ఫ్లైట్ అటెండెంట్‌ను కోరగా, ఆమె మరింతగా రెచ్చిపోయింది. పైగా, తాను ప్యాసెంజర్ల బెదిరింపులకు లొంగిపోయేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు, ఇతర ప్యాసెంజర్లు కూడా ఫ్లైట్ అటెండెంట్‌తో వాదనకు దిగారు. సిబ్బంది తీరుకు నిరసనగా విమానం నుంచి దిగిపోయారు. దీంతో, ఫ్లైట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.
 
దీనిపై ఎయిర్ కెనడా  స్పందించింది. విమాన సర్వీసు రద్దయిన మాట వాస్తవమేనని ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర సిబ్బంది సాయంతో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చామని తెలిపింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇందుకు కారణమైన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అంతేకాకుండా, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి పరిహారం కూడా చెల్లిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఎయిర్ కెనడా ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.