శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 27 జూన్ 2017 (04:51 IST)

మోదీకి సెల్యూట్ చెప్పిన ట్రంప్.. వైట్ హౌస్‌లో సాదర స్వాగతం

అమెరికా అధ్యక్ష భవనంలో భారత ప్రధాని నరేంద్రమోదీకి అపూర్వ స్వాగతం లభించింది. పాశ్చాత్య దేశాల అధినేతలకు ఇవ్వని గౌరవాన్ని ట్రంప్ మోదీకి ఇచ్చి ప్రారంభంలోనే శుభ సంకేతమిచ్చారు. ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానమంత్రిని వైట్‌ హౌస్‌లోకి ఆహ్వానించడం

అమెరికా అధ్యక్ష భవనంలో భారత ప్రధాని నరేంద్రమోదీకి అపూర్వ స్వాగతం లభించింది. పాశ్చాత్య దేశాల అధినేతలకు ఇవ్వని గౌరవాన్ని ట్రంప్ మోదీకి ఇచ్చి ప్రారంభంలోనే శుభ సంకేతమిచ్చారు. ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానమంత్రిని వైట్‌ హౌస్‌లోకి ఆహ్వానించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ చెప్పారు. మంగళవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో మోదీ భేటీ అయిన తర్వాత ఇరువురు  నాయకులు సంయుక్త ప్రకటన చేశారు. మనమిద్దరం ప్రపంచ నేతలం అని చెప్పడం ద్వారా ట్రంప్ భారత్ ప్రధానికి తనతో సమాన స్థాయినిచ్చారు. 
 
ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మోదీ తొలిసారి ఆయనతో భేటీ అవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైట్‌హౌస్‌లో దాదాపు 20 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపిన ఇరువురు నేతలు రక్షణ, ఉగ్రవాదం, ఎనర్జీ రంగాలపై చర్చించినట్లు వైట్‌ హౌస్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా మంగళవారం రాత్రి ట్రంప్‌తో కలిసి మోదీ డిన్నర్‌ చేస్తారని చెప్పారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్‌ తొలి అధికారిక డిన్నర్‌ మోదీదే కావడం విశేషం.
 
సంయుక్త ప్రకటనలో మోదీని ఆకాశానికెత్తిన ట్రంప్ భారత్‌-అమెరికాల మధ్య అనుబంధం ఇంకెప్పుడు ఇంత బలమైందిగా ఉండబోదని చెబుతున్నానన్నారు. ట్రంప్ మాటల్లో చెప్పాలంటే..  మోదీ, నేను సోషల్‌ మీడియాలో ప్రపంచ నాయకులం. నేను మోదీకి సెల్యూట్‌ చేస్తున్నాను. నేను మీకు సెల్యూట్‌ చేయడానికి లెక్కలేనన్ని కారణాలు ఉన్నాయి. అందులో భారత్‌ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కావడం ఒకటి. ఇరు దేశాల్లో ఉద్యోగాల కల్పన కోసం మీతో కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వ్యాపారాలను మరింత ప్రోత్సహించేందుకు ఉన్న కొన్ని అడ్డంకులను తొలగిస్తే బావుంటుంది. దీనికి తగిన విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను. ఆర్థిక రంగంలో సహకారాన్ని విస్తృతం చేసుకునేందుకు మోదీ.. నా కూతురు ఇవాంకను భారత్‌కు ఆహ్వానించారు. అమెరికాకు విచ్చేసి మా ఆతిథ్యం స్వీకరించింనందుకు మోదీ మీకు థ్యాంక్స్‌. భారత్‌, అమెరికాలు ఎల్లప్పుడూ స్నేహహస్తాన్ని చాస్తాయి. ఒకరిని మరొకరు గౌరవించుకుంటాయి.
 
ట్రంప్ ప్రసంగానికి ప్రతిగా వైట్ హౌస్‌లో తనకు లభించిన ఘనస్వాగతానికి మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత్‌ గురించి మీరు చేసిన వ్యాఖ్యలకు ధన్యవాదాలు.  ఈ రోజు మీరు చాలా సమయం వెచ్చించారు. మన ఇద్దరి మధ్య సాగిన సంభాషణలు భారత్‌-అమెరికాల మధ్య సంబంధాల్లో కీలకం అవుతాయి. నా విజన్‌ 'న్యూ ఇండియా'కు ట్రంప్‌ విజన్‌ 'మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌'లు విడివిడిగా కంటే కలివిడిగా సాగితే విజయం సాధిస్తాయని నాకు అనిపిస్తోంది. ఇండో పసిఫిక్‌ రీజియన్‌లో శాంతి భద్రతలను నెలకొల్పడం ఇరు దేశాల లక్ష్యం. మీ సారథ్యంలో ఇరుదేశాల సంబంధాలు కొత్త ఎత్తుకు చేరతాయని ఆశిస్తున్నాను. నేను మీకు కీలక భాగస్వామిని కాగలను. మీరు, మీ కుటుంబ సభ్యులందరితో కలిసి భారత్‌కు రావాలని ఆహ్వానిస్తున్నాను అంటూ మోదీ ప్రసంగించారు.
 
భారత ప్రధాని మోదీ అమెరికా సందర్శనకు కొన్ని గంటల ముందే, పాకిస్తాన్‌లో ఉంటున్న హిజ్బుల్‌ మొజాహిద్దీన్‌ నేత సలావుద్దీన్‌ను ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో కశ్మీర్‌లో అల్లకల్లోలానికి కారణం సలావుద్దీనేనని భారత్‌ చెప్తున్నవి కేవలం ఆరోపణలేననే పాకిస్తాన్‌ కపట వేషాలు బయటపడ్డాయి.  సలావుద్దీను గ్లోబల్‌ టెర్రరిస్టుగా గుర్తించడం పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బే. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమెరికా వద్ద పాక్ పాచికలు పారడం లేదు.