డొనాల్డ్ ట్రంప్‌కు మోదీ ఫోన్.. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వివిధ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సిద్ధంగా వున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్రంప్‌కు బుధవారం ఫోన్ చేసి అభినందించారు. ఈ విషయాన్ని మోదీ తన 'ఎక్స్' ఖాతా ద్వారా వెల్లడించారు.
ప్రపంచ శాంతి కోసం కలిసి పని చేయాలనే అభిప్రాయానికి ఇరువురు నేతలు వచ్చినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రపంచం మొత్తం ప్రధాని మోదీని ప్రేమిస్తోందని, భారతదేశం అద్భుతమైన దేశమని, భారత ప్రధాని అద్భుతమైన వ్యక్తి అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
భారత్‌ను నిజమైన స్నేహితునిగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీకి ట్రంప్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తన విజయం తర్వాత తాను మాట్లాడిన మొదటి ప్రపంచ నాయకులలో ప్రధాని మోదీ ఒకరని ట్రంప్ వెల్లడించారు.
ఇకపోతే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను విజయం వరించింది. భారీ లీడ్‌తో తన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌పై ఆయన గెలుపొందారు. దీంతో అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు.