మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (09:22 IST)

అమెరికా క్యాపిటల్ భవనం వద్ద కారు బీభత్సం... మూసివేత

అమెరికాకు గుండెకాయలాంటి క్యాపిటల్ భవనాన్ని మూసివేశారు. ఈ భవనం వద్ద శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారి మరణించగా, కారు డ్రైవర్‌ను భద్రత సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా క్యాపిటల్ భవనాన్ని అధికారులు మూసివేశారు. భవనం ప్రాంగణాన్ని దిగ్బంధించారు. 
 
కాగా, శుక్రవారం మధ్యాహ్నం అధ్యక్ష భవనానికి సమీపంలో ఓ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఉన్నట్లుండి ఓ కారు ఇద్దరు పోలీసులపైకి దూసుకువెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అనుమానితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఓ పోలీసుతో పాటు అతడిని కూడా ఆసుపత్రికి తరలించారు. 
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పోలీసు అధికారి విలియమ్ ఎవన్స్‌తో పాటు కాల్పుల్లో గాయపడిన నిందితుడు కూడా మృతిచెందాడు. ఈ ఘటన నేపథ్యంలో క్యాపిటల్ భవనాన్ని మూసివేసిన అధికారులు.. భవన సముదాయం వద్ద భారీగా నేషనల్‌ గార్డ్స్‌ను మోహరించారు. 
 
పోలీస్ అధికారి ఎవన్స్‌ మృతి పట్ల అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అధికారికి సంతాపంగా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఏప్రిల్​ 6 వరకు జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశించారు. అటు పోలీసు అధికారి మృతి పట్ల అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. ఎవన్స్​ మృతి పట్ల కమల సంతాపం తెలిపారు. 

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయన్న అక్కసుతో అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అనుచరులను రెచ్చగొట్టి ఇదే క్యాపిటల్ భవనంపై దాడికి ఉసిగొల్పిన విషయం తెల్సిందే. ఈ దాడితో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిగురైంది.